ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
నకరికల్లు:స్థానిక శ్రీలక్ష్మీనర్సింహస్వామి కొండ వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టామహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో కొండ ప్రారంభంలో స్వామివారి భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అర్చకుడు కొడవటికంటి మధుసూధనాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు చేశారు. భక్తుల సహకారంలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శనివారం తెలిపారు. గుంటూరు సుదర్శిని నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో మొబైల్ ఐ క్లినిక్ ద్వారా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
అమరావతి:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి లోని శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తికమాసం అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.చంద్రశేఖరరావు సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ మాట్లాడుతూ అమరేశ్వరునికి ఈ కార్తిక మాసంలో రూ.1,57,82,956 ఆదాయం వచ్చిందన్నారు. ఈ నగదు మొత్తాన్ని దేవాలయ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నామని తెలిపారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈనెల 28, 29 ,30వ తేదీల్లో జరగనున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 71వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లవరపు పవన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద జాతీయ మహాసభల ప్రచార పోస్టర్లు ఆవిష్కరించారు. పవన్‌కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ దేశవ్యాప్తంగా విద్య, యువత, జాతీయత ఆధారంగా విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కన్వీనర్ గంగాధర్, ఏఎన్‌యూ విభాగ ఉపాధ్యక్షుడు రామ్, కార్యదర్శి వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్: నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తిగా బాపట్ల 6వ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి శ్యాంబాబు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన డాక్టర్ ఎన్.సత్యశ్రీ అనంతపురం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఎవ్వరినీ నియమించక పోవడంతో బాపట్ల ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తిని ఇన్‌చార్జిగా నియమించారు.
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం
ఘనంగా ఆంజనేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం


