రసవత్తరంగా కోడిపోరు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా కోడిపోరు

Nov 23 2025 5:51 AM | Updated on Nov 23 2025 5:51 AM

రసవత్తరంగా కోడిపోరు

రసవత్తరంగా కోడిపోరు

వీరుల ఆయుధాలకు గ్రామోత్సవం వీరులకు నీరాజనాలు పలికిన ప్రజలు

నేటితో ముగియనున్న ఉత్సవాలు

కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా శనివారం వీరుల గుడి ఆవరణలో కోడిపోరు నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సినీ నిర్మాత బండ్ల గణేష్‌ పాల్గొన్నారు. ముందుగా వీర విద్యావంతులు కోడిపోరు కథాగానం చేశారు. తర్వాత బండ్ల గణేష్‌ ఒక పుంజును మరొకరు మరో పుంజును బరిలోకి వదిలారు. ఒకటి బ్రహ్మనాయుడు పుంజు చిట్టిమల్లుగా, మరొకటి నాగమ్మ పుంజు శివంగిడేగగా వీరవిద్యావంతులు అభివర్ణించారు. రెండు పందేలలో బ్రహ్మనాయుడు పుంజు గెలిచిందని మూడో పందెంలో బ్రహ్మనాయుడు పుంజు ఓడిందని ప్రకటించారు. పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ బ్రహ్మనాయుడు పాత్రలో మరో ఆచారవంతుడు నాయకురాలు నాగమ్మ పాత్రను పోషించారు.

రణక్షేత్రంలో గ్రామోత్సవాల సందడి

వీరుల ఆయుధాలతో వీరాచారులు పౌరుషంతో ఊగిపోయారు. అలనాటి వీరుల ఆయుధాలతో వీరంగమాడారు. కత్తులతో విన్యాసాలు చేశారు. కత్తులతో గుండెలపై బాదుకుంటూ రగిలిపోయారు. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. వీరుల ఆయుధాలను వారిపై వాల్చి వారి ఆవేశాన్ని తగ్గించారు. పాత కారెంపూడి బజార్లన్నింటిలో గ్రామోత్సవాలు కొనసాగాయి. గ్రామస్తులంతా ప్రతి ఇంటి వద్ద వారు పోసి కొబ్బరికాయలు కొట్టి పూల దండలు వేసి వీరులకు నీరాజనాలు పలికారు. వీరాచారులు ఆయుధాలను వారిపై వాల్చి ఆశీర్వాదం అందించారు. ఉదయాన్నే వీరుల గుడి నుంచి గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవస్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు చేసుకున్నారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడ కూడా కత్తి సేవలు కొనసాగించారు. తర్వాత నుంచి గ్రామోత్సవానికి వీరుల ఆయుధాలు బయలుదేరాయి. మొదట తోట బజారులో ఉన్న బ్రహ్మనాయుడు మేడ వద్దకు ఆయుధాలన్నీ తరలివెళ్లాయి. అక్కడ కూడా సంప్రదాయ కత్తి విన్యాసాలు చేశారు. ఆ ప్రాంత వాసులంతా పల్నాటి వీరులకు నీరాజనాలు పట్టారు. రాత్రి వరకు ఆ బజారులోనే వీరుల ఆయుధాలు ప్రతి గడప నుంచి పూజలందుకున్నాయి. గ్రామోత్సవం పూర్తయ్యే సరికి అర్థరాత్రి దాటే అవకాశం కన్పిస్తోంది. కోట బురుజు సమీపంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి హారతులిచ్చారు. ఉదయాన్నే వీరాచారులు పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత నుంచి గ్రామోత్సవాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు చేసుకుని అంకాలమ్మ తల్లి చెన్నకేశవస్వామిలకు నైవేద్యం అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీరాచారులతో పాటు ప్రజలు కూడా వేలాదిగా ఉత్సవానికి తరలివచ్చారు.

ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ

పల్నాటి ఉత్సవాలలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ పాల్గొన్నారు. వారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలసి వీరుల గుడిలో ఆయుధాలకు పూజలు చేశారు. కోడిపోరు ప్రదర్శన ముగిసిన తర్వాత కొద్దిసేపు సందడి చేశారు. అనంతరం ఎడ్ల పోటీలను వారు ప్రారంభించారు.

ఐదు రోజులుగా జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కళ్లిపాడు నాడు వీరుల ఆయుధాలు కళ్లి పోతురాజు మండపం వద్ద కళ్లికి ఒరగడంతో ఉత్సవాలను ముగించి వీరాచారులు స్వగ్రామాలకు పయనం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement