యంత్రాలతో కోతవైపే రైతుల మొగ్గు
సమయం ఆదా, తక్కువ ఖర్చు అంటున్న అన్నదాతలు యంత్రాలతో కోస్తే పశుగ్రాసానికి ముప్పు
చెరుకుపల్లి: ఈ ఏడాది ఖరీఫ్ వరి సేద్యం చివరి అంకానికి చేరుకుంది. దీంతో పలు గ్రామాల్లో వరి కోతలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా రైతులు హార్వెస్టర్, యంత్రాలతో కోతలు కోస్తున్నారు. వరి కోత పనులు యంత్రాలతో చేయటం ద్వారా సమయంతోపాటు కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. కూలీలతో కోతకు ఎకరాకు రూ.4 వేలు, ఓదెలకు రూ.800, కుప్ప వేసేందుకు రూ.4 వేలు, నూర్పిడికి రూ. 6 వేలు వంతున ఖర్చు అవుతుంది. అదే యంత్రంతో కోతకు సుమారు రూ. 4 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ధాన్యం వెంటనే విక్రయించే వీలుంటుందని, అందుకే ఎక్కువ శాతం మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
హెచ్చరికతో ముమ్మరం
గతంలో ఎన్నడు లేని విధంగా రైతులు ఎక్కువ శాతం వరికోత యంత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. పంట చేతికందే ప్రస్తుత దశలో వరుస వాయుగుండ హెచ్చరికలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే వెంటనే యంత్రాలతో కోసి ధాన్యాన్ని విక్రయించేస్తున్నారు.
పశుగ్రాసానికి కొరత
యంత్రాలతో కోత వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసానికి కొరత ఏర్పడుతుందని పశు పోషకులు అంటున్నారు. వరి దుబ్బులను సగానికి పైగా వదిలేసి యంత్రాలు కోస్తాయి. దీంతో ఎండు గడ్డి పరిమాణం బాగా తగ్గుతుంది. దీనికి తోడు ధాన్యం నూర్చటం వల్ల గడ్డి పూర్తిగా నలిగి బయటకు వస్తుంది. కోసిన గడ్డి యంత్రాల చక్రాల కింద నలిగిపోయి బురద అంటుకుంటుంది. ఈ గడ్డిని తినటానికి పశువులు ఆసక్తి చూపవు.


