‘ప్రైవేటు’లో వైద్యం! | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు’లో వైద్యం!

Aug 21 2025 6:54 AM | Updated on Aug 21 2025 6:54 AM

‘ప్రై

‘ప్రైవేటు’లో వైద్యం!

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సీనియర్‌ వైద్యుల తీరుతో రోగులకు తీవ్ర అవస్థలు

ప్రభుత్వాసుపత్రిలో అటకెక్కిన వైద్యుల సమయపాలన సీనియర్‌ వైద్యుల సేవల కోసం రోగుల ఎదురుచూపులు జూనియర్లే అన్నీ చూస్తున్నా పట్టించుకోని అధికారులు మొక్కుబడి తనిఖీలతో గాడి తప్పిన ఆస్పత్రి నిర్వహణ ‘స్పందన’లోనూ ఈ అంశాలపైనే బాధితుల ఫిర్యాదు

రోగుల వేదన వెల్లడి

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సీనియర్‌ వైద్యుల తీరుతో రోగులకు తీవ్ర అవస్థలు

ఉమ్మడి ఏపీలో పేదల పెద్ద ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్‌లో రోగులు వైద్యుల కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల కోసం సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు రోజూ గుంటూరు జీజీహెచ్‌కు వస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసలతో చికిత్స కోసం వచ్చే పేద రోగులపై సీనియర్‌ వైద్యులు చిన్నచూపు చూస్తున్నారు. వారు జీజీహెచ్‌లో జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు చేస్తున్నారు. రోగులకు జూనియర్‌ వైద్యులే పెద్ద దిక్కుగా మారుతున్నారు.

గుంటూరు మెడికల్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుంటూరు జీజీహెచ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. అవుట్‌ పేషెంట్‌ విభాగం (ఓపీ) రోగులకు సేవలు అందించాల్సి ఉంటుంది. వైద్యులకు బయోమెట్రిక్‌ హాజరు ఉన్నప్పటికీ సమయపాలన పాటించడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నా వైద్యులు ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్‌ హాజరు వేసి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు, సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. జీజీహెచ్‌లో ఉండాల్సిన సమయంలో ‘ప్రైవేటు’ వైద్య సేవల్లో తరిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందించి, గంట సేపు భోజన విరామం తీసుకున్న తరువాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వార్డుల్లో బెడ్‌సైడ్‌ టీచింగ్‌ చేస్తూ రోగులను చూడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది సీనియర్‌ వైద్యులు ఓపీలోనే జూనియర్‌ వైద్యులకు పాఠాలు చెబుతూ రోగులను వేచి ఉండేలా చేస్తున్నారు. మరికొంత మంది విభాగాధిపతులు ఓపీలకు రాకుండా వార్డుల్లో ఉంటూ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం విభాగాధిపతులు కూడా ఓపీలకు హాజరై రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. సీనియర్‌ వైద్యులు, విభాగాధిపతులు ఓపీలకు హాజరు కాకపోవడంతో జూనియర్లు తమకు తోచిన వైద్యం చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీని వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సలు అందక రోగులు పలుమార్లు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది.

తనిఖీలు శూన్యం

ఆసుపత్రిలో ఓపీ పనివేళల్లో సీనియర్‌ వైద్యులు విధుల్లో ఉన్నారా? లేదా? రోగులు వైద్య సేవలు పొందేందుకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? అనే విషయాలు పరిశీలించేందుకు రోజూ జీజీహెచ్‌ అధికారులు, వైద్య కళాశాల అధికారులు సమన్వయంతో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌, గైనకాలజీ, ఆప్తామాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, డెంటల్‌, పీడియాట్రిక్స్‌, రేడియాలజీ వంటి స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, క్యాన్సర్‌ వంటి సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవల కోసం రోజూ 3 వేల నుంచి 4 వేల మంది రోగులు జీజీహెచ్‌కు వస్తున్నారు. రోగులు పెద్ద ఆసుపత్రిపై ఎంతో నమ్మకంతో వస్తుంటే, సీనియర్‌ వైద్యులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వైద్యులు నిర్ణీత పనివేళలు పాటించేలా పర్యవేక్షణ చేయాల్సిన ఆసుపత్రి, వైద్య కళాశాల అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీజీహెచ్‌కు సుదూర ప్రాంతాల నుంచి చికిత్సకు వస్తున్నామని, పెద్ద సార్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల పలుమార్లు రావాల్సి వస్తోందంటూ పలువురు బాధిత రోగులు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో లిఖితపూర్వకంగా తెలియజేశారు. వైద్యుల పనితీరును పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎందుకు మిన్నకుండిపోతున్నారో అర్థంకాక రోగులు తలలు పట్టుకుంటున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ జీజీహెచ్‌ వైద్యుల సమయపాలనపై దృష్టి సారించాల్సి ఉంది. నిర్ణీత పనివేళల్లో వారు అందుబాటులో ఉండి రోగులకు సత్వర సేవలు అందేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

‘ప్రైవేటు’లో వైద్యం! 1
1/1

‘ప్రైవేటు’లో వైద్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement