
కూటమి నేతలు పాడిందే ‘పాట’
కొల్లి శారద మార్కెట్ షాపులలో కూటమి నాయకుల పాగా
నెహ్రూనగర్: ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ దుకాణాల వేలం పాటలో కూటమి నేతలు సిండికేట్‌గా మారి దక్కించుకున్నారు. మార్కెట్‌లో ఉన్న 81 షాపులకు 18, 19, 20వ తేదీల్లో వేలం పాట నిర్వహించారు. పాత లీజుదారులు మంగళ, బుధవారాల్లో వారూ పాల్గొన్నారు. మంగళవారం 43వ నంబర్ షాపును రూ.1.06 లక్షలకు పాడుకున్నారు. బుధవారం 47వ నంబర్ షాపునకు ప్రభుత్వ అద్దె రూ.14,488 గా ఉండగా... దానిని ఒక్కసారే పాత లీజుదారుడు రూ.లక్షకు పెంచేశారు. అలా రూ.1,13,000కు షాపును దక్కించుకున్నారు. ఇదంతా చూస్తుంటే దుకాణాలపై ఎంత ఆదాయం వస్తుందో... అధికారులు ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారో అర్థం కావడం లేదని నగరవాసులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. మార్కెట్‌లోని 17ఏ నంబర్ షాపు ఎస్సీ వర్గీయులకు కేటాయించారు. పదుల సంఖ్యలో పోటీ పడ్డారు. కానీ ఎవరూ వేలంలో పాల్గొనకుండా కూటమికి చెందిన ఓ వ్యక్తి చక్రం తిప్పారు. పోటీదారులకు రూ.10 వేలు చొప్పున ఇచ్చినట్లు సమాచారం. దీంతో రూ.8 వేలకు మాత్రమే పాట పోయింది. అధికారులు రీ ఆక్షన్‌కు సిద్ధమైనట్లు సమాచారం. బుధవారం ఎస్సీ వర్గానికి కేటాయించిన 58వ నంబర్ షాపును ఎస్సీలను అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు దక్కించుకున్నారు. 25 మంది వరకు బిడ్డింగ్‌లో పాల్గొన్నారు. వీరికి రూ.10 నుంచి రూ.25 వేల చొప్పున ఇచ్చి కేవలం రూ.21 వేలకు పాడుకున్నారు. మరోవైపు పాత లీజుదారులు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 67వ షాపునకు అత్యధికంగా రూ. 5.50 లక్షలకు పాట పాడారు.