
గుంటూరు జిల్లా తాడేపల్లి వరకు కొనసాగిన ఆంక్షలు
వెంట వెళ్లే వాహనాలను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్న కాకాణి
కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వెల్లడి
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు.
ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.
నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి.
కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాం
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
మంత్రిగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు.
ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు.