
నవ్యాంధ్రలో నయా దందా
వ్యాపారులపై కిరాయి గూండాలతో దౌర్జన్యం షాపుల్లో ఉన్న వస్తువులు బయట పడేసి తాళాలు వేసిన రౌడీమూక కోర్టు పరిధిలో ఉందంటున్న వ్యాపారులు తరచుగా జరుగుతున్న సంఘటనలు నిద్రావస్థ వదలని పోలీసు అధికారులు
పోలీసులు వచ్చినా లెక్కేలేదు...
తాడేపల్లి రూరల్: నవ్యాంధ్ర రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో షాపుల అద్దె రేట్లు పెంచేందుకు కొంతమంది యజమానులు నయా దందా నిర్వహిస్తున్నారు. షాపులను ఖాళీ చేయించడానికి కిరాయి రౌడీలను తీసుకొచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. బుధవారం ఇదే తరహాలో విజయవాడకు చెందిన ఓ షాపు వద్దకు సుమారు 20 మంది రౌడీ మూకలను యజమాని తీసుకొచ్చాడు. దౌర్జన్యంగా షాపులో ఉన్న వారిని బయటకు పంపించి, గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. షాపు లోపల ఉన్న సామగ్రినికి కూడా బయట పడవేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితులైన వెంకటరావు, విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన బిట్రా వెంకట రమణమ్మ దగ్గర దాదాపు 20 సంవత్సరాల క్రితం వ్యాపారం నిర్వహించుకునేందుకు షాపు అద్దెకు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రాంతం రాజధాని అయిన తరువాత అద్దెలు ఎక్కువ ఇవ్వాలని వెంకట రమణమ్మ కుమారుడు హేమంత్ కోరగా తాము నిరాకరించినట్లు పేర్కొన్నారు.
కోర్టు తీర్పుతో..
అప్పట్లో అతను కోర్టును ఆశ్రయించగా, 90 రోజుల గడువు ఇచ్చింది. 20 రోజులు కాగానే కొంతమంది రౌడీ మూకలను హేమంత్ కుమార్ తీసుకువచ్చి షాపులో ఉన్నవారిపై దాడి చేశాడు. గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు లాక్కున్నాడు. షాపులోని బియ్యం బస్తాలను బయటకు విసిరేశాడు. మరో షాపులో చెప్పులను పడేశాడు. ఇదేమని ప్రశ్నించిన వారిపై రాడ్లతో దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడ్డారు.
గతంలో కూడా ఉండవల్లి సెంటర్‌లో ఇదే తరహాలో ఏలూరు నుంచి ట్రాన్స్‌జెండర్లను తీసుకొచ్చి షాపులను ఖాళీ చేయించారు. నవ్యాంధ్ర రాజధానిలో ఇలాంటి దౌర్జన్యాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం పోలకంపాడులో ఓ వ్యక్తి ఇలాగే ప్రవర్తించాడు. అందరూ బంధువులు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కోర్టులో ఉండగా ఇలా దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గమని బాధితులు వాపోయారు. పోలీసులు ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో రౌడీలను తీసుకువచ్చి దౌర్జన్యానికి పాల్పడడం సరికాదని, జరిగిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక పోలీసులకు యజమానులు సమాచారం అందించగా కానిస్టేబుల్ వచ్చారు. ఆయనపై దురుసుగా ప్రవర్తించి, అక్కడే ఉన్న బియ్యం కింద పారపోశారు. కానిస్టేబుల్ అరవడంతో ఆ బియ్యాన్ని మళ్లీ సంచిలోకి ఎత్తారు.

నవ్యాంధ్రలో నయా దందా

నవ్యాంధ్రలో నయా దందా