
డెల్టా రైతు బతుకు ఉల్టా!
గత నెలలో వానలు లేక మొలకెత్తని వరి రెండోసారి వెద పద్ధతిలో రైతన్నల సాగు మళ్లీ భారీ వర్షాలకు నీట మునిగిన 72 వేల ఎకరాల పంట ఎకరానికి దాదాపు రూ.12 వేల వరకు నష్టపోయిన కర్షకులు రెండేళ్లుగా కష్టాలతో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం
కూటమి సర్కారు నిర్లక్ష్యంతో నిండా మునిగిన అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో వెద జల్లితే 72 వేల ఎకరాలకుపైగా దెబ్బతిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మొత్తం 71,612 ఎకరాల్లో పంటలు నీట మునిగాయని చెబుతున్నారు. ఇందులో వరి 62,275, పత్తి 8,550, మినుము 787.5 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎక్కువ భాగం మళ్లీ పంట వేయాల్సిందేనని చెబుతున్నారు. ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. కొంతమంది ముందస్తుగా ఎరువులు పొలాలకు తీసుకురావడంతో వానలకు అవి కొట్టుకుపోయాయని చెబుతున్నారు. ముందస్తు కౌలు చెల్లించి పొలాలు తీసుకున్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గత ఏడాది కూడా వీరు బాగా నష్టపోయారు. కొద్దో గొప్పో పడిన నష్టపరిహారం కూడా కౌలు రైతులకు బదులు భూ యజమానుల ఖాతాకు ఆ మొత్తం పడింది.
సర్కార్ నిర్లక్ష్యమే ముంచేసింది..
డ్రైనేజీ, సాగునీటి కాల్వలు పూడిక తీయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వేసవి కాలంలో తొలగించాల్సిన గుర్రపు డెక్క పనులను వర్షాలు పడ్డాక హడావుడిగా చేసి మమ అనిపించారు. దీన్ని పూర్తిగా తొలగించకపోవడంతో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయింది. పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అధిక వర్షాలకు తోడు డ్రెయిన్లలో పూడికలు తొలగించకపోవడంతో తెనాలి, పెదకాకాని, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. గుంటూరు నల్ల డ్రెయిను–2కు రెండు, మూడు చోట్ల గండ్లు పడ్డాయి. పంట పొలాలను అందులోని వరద నీరు ముంచెత్తింది. చేబ్రోలు మండలంలోని శలపాడు వద్దగల జాగిరి వంతెన సైతం మునిగిపోయింది. మునిపల్లె, వెల్లలూరు, కసుకర్రు, నిడుబ్రోలు, కొండమూది, నండూరు, కట్టెంపూడి, పచ్చల తాడిపర్రు, చిన ఇటికంపాడు తదితర గ్రామాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నంబూరు, గోళ్ళమూడి, పెదకాకాని, తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, రామచంద్రపాలెం, వెంకటకృష్ణా పురం, దేవరాయబొట్లవారి పాలెం, తంగెళ్ళమూడి గ్రామాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కూటమి పాలకుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరద నీరు ఇంకాల్సిందే...
రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా వాగులు పొంగడం వల్ల వచ్చిన వరద ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. కొండవీటి వాగు విషయానికి వస్తే నీరు బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడం, ప్రణాళిక లేని పనులు చేపట్టడంతో అమరావతి ముంపు బారినపడింది. కొత్త కాల్వలు నిర్మించకపోవడం, ఉన్న వాటిని మూసివేయడం, తూములు కూడా సరైన చోట వేయకపోవడం వల్ల నీరు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా పెదపరిమి, నీరుకొండ మధ్య వేలాది ఎకరాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. కొండవీటివాగు, కొట్టేళ్లవాగు, పాలవాగు, సారవాగు ఒకేసారి పొంగి ప్రవహించడంతో ముంపు ముప్పు పెరిగింది. వాగుల నుంచి వచ్చే వరదను ఎలా బయటకు పంపాలన్న విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయలేదు. అందుకే ముంపు పెరిగిందన్న వాదన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. మూడు రిజర్వాయర్లు కడతామన్న అంశం ప్రకటనలకే పరిమితం కావడం కూడా ఇబ్బందికరంగా మారింది. కొండవీటి వాగుకు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినా ఆ నీరు తాడేపల్లి వద్ద ఉన్న ఎత్తిపోతల వద్దకు రాకపోవడంతో ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చిన నీరు ఇంకిపోవడం తప్ప బయటకు పోయే మార్గం కనపడటం లేదు. దీంతో ఈ ముంపు ప్రాంతంలో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది.
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డెల్టా రైతాంగం కుదేలైంది. గత నెలలో వరి విత్తనాలు వెద జల్లినా వర్షాభావ పరిస్థితుల వల్ల మొలకెత్తలేదు. మళ్లీ ఈ నెలలో వెద జల్లారు. ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చాయి. అకస్మాత్తుగా కురిసిన అతి భారీ వర్షాలకు మళ్లీ పంట పూర్తిగా మునిగింది.