
నదీ తీరం.. అక్రమార్కుల పరం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదీ తీర ప్రాంతం అక్రమార్కుల పరమవుతోంది. నదీ తీరాన శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న జలవనరుల శాఖ నిబంధనలు గాలికి వదిలేసింది. దర్జాగా ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు జరిగినా అటు ఇరిగేషన్, ఇటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వరదలు వస్తే నదీ తీర ప్రాంతం కచ్చితంగా మునిగిపోతుందని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు నదీ తీరాన షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చేస్తున్నారు. భవానీపురం పున్నమి హోటల్‌కు ఆనుకుని విద్యాధరపురం హిందూ శ్మశానవాటికకు దక్షిణం వైపు గత కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన చిన్న చిన్న గుడిసెల స్థానంలో ఇప్పుడు షెడ్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు ఒక వ్యక్తి గుడి మాటున పక్కా కట్టడాలు నిర్మిస్తున్నాడు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని పున్నమి ఘాట్‌కు ఇవతల కరకట్ట సౌత్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ప్రతిరోజూ ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను చూసి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.