
ధైర్యానికి దిశ.. ‘శక్తి’తో నిరాశ
గుంటూరు నగరంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు దిశ యాప్ ఉన్నప్పుడు క్షణాలలో యంత్రాంగం స్పందన నేడు శక్తి యాప్‌పై అవగాహన కూడా కల్పించని సర్కారు బాధితుల రక్షణకు చంద్రబాబు పాలనలో అదే నిర్లక్ష్యం
ఆడబిడ్డకు అండగా నిలవాలనే ధ్యేయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ‘దిశ’.. ఆపన్నుల గుండెల్లో ధైర్యం నింపింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న యాప్‌తో ఎందరో రక్షణ పొందారు. కానీ నేడు కూటమి పాలకులు తెచ్చిన ‘శక్తి’ యాప్‌తో భరోసా కాదు కదా.. కనీసం యాప్ ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు.
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో దిశ పోలీసు స్టేషన్‌లను ప్రారంభించి, యాప్ అందుబాటులోకి తెచ్చారు. మహిళలు, యువతులు, బాలికలు తమ సమస్యలు చెబితే తక్షణ సాయం అందేది. సేవ్ అవర్ సోల్స్ (ఎస్‌వోఎస్)కు కాల్ చేస్తే క్షణాల్లో పోలీసులు రక్షించారు. కాకాని రోడ్డులో ఒక దుర్మార్గుడి చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య కేసులో అప్పటి స్టేషన్ ఎస్‌హెచ్‌వో కె. వాసు కేవలం 20 రోజులలోపు చార్జిషీటు దాఖలు చేశారు. ఏడు నెలల్లో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రత్యేక కోర్టుల ద్వారా ఈ శిక్ష పడేలా చేశారు. మైనర్‌లపై అత్యాచారాలకు ఒడిగట్టిన వారికి శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. దిశ యాప్ ప్రారంభంమైన నాటి నుంచి 2024 ఎన్నికల వరకు 1.30 కోట్ల మందికిపైగానే సేవలను వినియోగించుకున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో 11.13 లక్షల మంది సేవలు పొందారు. దిశ ఎస్‌ఓఎస్ ఫోన్‌కాల్స్ అందుకున్న వెంటనే 2,300 మందిని ఆపద నుంచి రక్షించారు. 403 మందిని ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్‌నకు సంబంధించి నమోదు అయిన కేసుల్లో 96 శాతం చార్జీషీట్లు నిర్ణీత వ్యవధిలో కోర్టుకు సమర్పించారు. సగటున బాధితుల నుంచి 60 నుంచి 70 ఫోన్ కాల్స్ వచ్చేవని అధికారులు చెప్పారు.
జిల్లా ‘దిశ’ ఎస్‌ఓఎస్ కాల్స్ ఎఫ్‌ఐఆర్ నమోదు/
చర్యలు తీసుకున్నవి
గుంటూరు 78,724 1,781
బాపట్ల 14,600 883
పల్నాడు 15,171 1,105
రక్షణ చర్యలు తీసుకుంటాం
నిత్యం కళాశాలల వద్ద రక్షక్ వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఆకతాయిలపై దృష్టి సారించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సిబ్బందిని ఉమెన్స్ కళాశాల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించాం. అవసరమైతే స్వయంగా పరిశీలనకు వెళ్తా. యువతులు, మహిళలు, బాలికల రక్షణకు చర్యలు తీసుకుంటాం.
– షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, ఈస్ట్

ధైర్యానికి దిశ.. ‘శక్తి’తో నిరాశ