రహదారి విస్తరణకు సర్వే ప్రారంభించాలి
ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ
గుంటూరు వెస్ట్: జాతీయ రహదారి 544ని వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు లైన్లుగా విస్తరించేందుకు జిల్లా పరిధిలోని జాయింట్ మేనేజ్మెంట్ సర్వేను వెంటనే ప్రారంభించాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిధిలో ఈ రోడ్డు 18 కిలో మీటర్ల వరకు ఉంటుందన్నారు. రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దీనిపై వచ్చిన రెండు అభ్యంతరాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణ పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభాలు పక్కకు జరపడంతోపాటు పైపులైనులు, కాలువలకు అంచనాలు తయారు చేయాలని పేర్కొన్నారు. డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎన్‌హెచ్ పీడీ పార్వతీశం పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించండి
జిల్లాలోని పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా ఇండస్ట్రియల్, ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.


