కులరహిత సమాజమే సర్వ శ్రేయోదాయకం
గుంటూరు ఎడ్యుకేషన్: కులరహిత సమాజమే సర్వ శ్రేయోదాయకమని ప్రజాకవి జయరాజ్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ కుల రహిత సమాజం (ఏసీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం బ్రాడీపేటలోని లూథరన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూలు ఆవరణలో ‘భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి.. అమలు తీరు’, ‘బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు‘, ‘భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలు‘ (17 సంపుటాలు) అంశాలపై ఓఎంఆర్ షీట్స్ ద్వారా వెయ్యి మంది పైగా విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తొలుత గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసిన అనంతరం ఏఎన్‌యూలో విద్యనభ్యసిస్తున్న మయన్మార్ బౌద్ధ భిక్షువులు ప్రార్థన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కవి జయరాజ్ మాట్లాడుతూ 500 ఏళ్ల కిందట దేశంలో నెలకొన్న సామాజిక అసమానతలు, కుల వివక్షతపై గౌతమ బుద్ధుడు తన బోధనలతో తిరుగుబాటు చేశారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనల ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు, యువతరం నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బుద్ధిస్ట్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ ముందస్తు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆయన జీవితం, నైతికత, ఆలోచన, బోధనలు తూచా తప్పక ఆచరించిన జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువతరానికి ఆదర్శమన్నారు. బౌద్ధ విజ్ఞానం విశ్వజననీయమైనదని, అష్టాంగ మార్గం ద్వారా మానవుడు ఎలా జీవించాలో బోధించారని తెలిపారు. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ బౌద్ధం నిజమైన తార్కిక ధోరణి అయితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం భారత జాతి ఆత్మ, గుండె చప్పుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీపీ మండల్ మహాసేన ప్రతినిధి డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏ.గవర్రాజు, కేకే బోధి, డి.రత్న ప్రదీప్, దేవరకొండ వెంకటేశ్వర్లు, అబ్రహం లింకన్, విశ్రాంత డీఎస్పీ పి.రవికుమార్, ఏసీఎఫ్ రాష్ట్ర మహిళా కన్వీనర్ రజిని, అల్లాడి దేవకుమార్, జి.ఆర్. భగత్ సింగ్, హేబేలు, నీలాంబరం, పి.వెంకటేశ్వర్లు, పలువురు బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, బహుజన మేధావులు పాల్గొన్నారు.
ప్రజాకవి జయరాజ్


