వచ్చి తీరాల్సిందే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేస్తున్న అమరావతి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా జన సమీకరణకు పడరాని పాట్లు పడుతోంది. గుంటూరు జిల్లాలోనే కార్యక్రమం జరుగుతున్నందున ఈ జిల్లా నుంచే భారీగా లక్షన్నర మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తం 1241 బస్సులు కేటాయించింది. 591 బస్సులు డ్వాక్రా మహిళలకు, 650 బస్సులు పార్టీ నాయకులకు అంటూ విభజన చేసింది. మొత్తం 691 గ్రామాల నుంచి 691 మంది సీసీలు 330 మంది వీఓఏల ద్వారా జన సమీకరణకు అధికారులు బస్సులను సిద్ధం చేశారు.
ప్రతి గ్రూపు నుంచి సగం మంది అయినా..
గుంటూరు జిల్లా డీఆర్‌డీఏలో 20,683 డ్వాక్రా గ్రూపులకు 2,27,513 మంది సభ్యులు ఉన్నారు. మెప్మా గ్రూపులు 21,400 ఉండగా, 2,14,000 మంది సభ్యులు ఉన్నారు. గుంటూరు నగరం నుంచే 740 బస్సుల్లో జనాన్ని తరలించనున్నారు. ప్రతి గ్రూపు నుంచి కనీసం సగం మంది అయినా సభకు హాజరు కావాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు నగరం నుంచే 80 వేల మందిని సమీకరించాలని మెప్మా నుంచి గ్రూపులపై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తం జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కాకుండా 1.20 లక్షల మంది డ్వాక్రా మహిళలను తరలించాలని ఆర్పీలకు సూచించారు.
తొలగిస్తామంటూ హెచ్చరికలు..
ఒక్కొక్క ఆర్పీ నాలుగు బస్సుల జనాన్ని సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 70 మంది ఆర్పీలు ఉండగా, 300 బస్సుల్లో జనాన్ని తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్పీలు టీడీపీ నాయకులతో సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. జనసమీకరణ చేయకుంటే తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకే జనాలను బస్సుల ఎక్కించి ఫొటోలు అప్‌లోడ్ చేయాలని, సభా ప్రాంగణానికి వెళ్లి కుర్చీల్లో కూర్చున్న తరువాత ఫొటోలు అప్‌లోడ్ చేయాలని సూచించారు. బస్సులో కూర్చునప్పుడే ఫొటో తీయాలని, టీడీపీ నాయకులతో కలిసి ఈ ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఇక సభా ప్రాంగణానికి నల్ల దుస్తులు, నల్ల బుర్కాలు, ఇతర నల్ల వస్తువులతో రావద్దని ఆదేశించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇలా..
నియోజకవర్గం నుంచి 248 బస్సుల్లో తరలిస్తున్నా రు. వీఓఏలు 120 మందికి బాధ్యతలు అప్పగించారు. డీఆర్‌డీఏ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి జనాన్ని సభకు తరలించాలని సూచించారు. ఎమ్మెల్యే, నాయకులు ఏర్పాటు చేసే ఒక్కో బస్సు కు ఒక్కో వీఓఏను ఇన్‌చార్జిగా నియమించారు.
ప్రధాని సభకు బస్సులు తరలడంతో ఖాళీగా కనిపిస్తున్న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్
ఆర్పీలకు బాధ్యతలు...12 గంటలకల్లా బస్‌లు ఎక్కించాలి ఆర్పీలతో అధికారులు, తెలుగుదేశం నాయకుల సమీక్షలు సమీకరణలో విఫలమైతేతొలగిస్తామంటూ బెదిరింపులు ప్రధాని సభకు రాజధాని ప్రాంతంలో ఇంటింటికి ఆహ్వానం గుంటూరు జిల్లాలోలక్షన్నర మంది తరలింపే లక్ష్యం సచివాలయ ఇంజినీరింగ్ ఉద్యోగులకు మంచినీటి పంపిణీ డ్యూటీలు
పొన్నూరు డిపో నుంచి..
పొన్నూరు నియోజకవర్గం నుంచి కనివిని ఎరుగని రీతిలో తరలి రావాలని ఎమ్మెల్యే నరేంద్ర పిలుపునిచ్చారు. పెరుగుతున్న భూముల ధరలను దృష్టిలో ఉంచుకొని సభను విజయవంతం చేయాలని ఆయన సన్నాహక సమావేశంలో కోరారు. పొన్నూరు డిపో నుంచి 16 ఆర్టీసీ బస్సులు, 70 ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు.
సచివాలయ సిబ్బందికి నీటి డ్యూటీ
సచివాలయ ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేశారు. సచివాలయాలలో ఇంజినీరింగ్ సిబ్బందికి మంచినీటి సరఫరా డ్యూటీలు వేశారు. జన సమీకరణ భారం మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలపైనే పడింది. తమ నేత పేరును ఆహ్వాన పత్రికలో వేయలేదంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఉండటంతో వారు జనసమీకరణపై దృష్టి పెట్టడం లేదు.


