
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు దహనం
లక్ష్మీపురం: ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గుంటూరులో శనివారం కొత్తపేట కార్యాలయం నుంచి మాయాబజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లును నాయకులు దహనం చేశారు. ముస్లిం సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింల సమస్య కాదని, అన్ని వర్గాల ఆస్తులను దోచుకొని బడా కార్పొరేట్లకు దోచిపెట్టే చర్యని విమర్శించారు. రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లిందని, తమ పార్టీ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించిందని తెలిపారు. ఈ దేశం ఒక కులానికో, మతానికో సంబంధించింది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆదేశ సూత్రాలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింలలో భయాందోళన సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ గుజరాత్ పెట్టుబడిదారులకు భారతదేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్ని కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో క్రైస్తవులు, హిందువుల ఆస్తుల్ని దోచుకునే యత్నంలో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలి, మేడా హనుమంతరావు, ఇఫ్తా జాతీయ కార్యదర్శి షేక్ గని, సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, ముస్లిం లీగ్ పార్టీ నాయకులు బషీర్ అహ్మద్ పాల్గొన్నారు.
నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించిన సీపీఐ పాల్గొన్న జాతీయ కార్యదర్శి కె.నారాయణ