
పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
తెనాలిటౌన్: భారీ వర్షానికి చెరువుల్లా మారిన మాగాణి భూములను జిల్లా వ్యవసాయ అధికారి ఐ.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. గుంటూరు–తెనాలి వయా నందివెలుగు రోడ్డుమార్గంలోని రూరల్ మండల గ్రామాలైన హాఫ్‌పేట, ఖాజీపేట, కొలకలూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. నీటి మునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంటపొలాల్లో చేరిన వర్షపునీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపుకునేలా చూడాలని రైతులకు సూచించారు. రాబోయే రెండు రోజుల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని గుర్తుచేశారు. రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్‌బాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.