
రైతు బాధలు పట్టని ఎమ్మెల్యే నరేంద్ర
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): భారీ వర్షాలకు పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నీట మునిగిన పంటలను బుధవారం పరిశీలించిన ఆయన గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకాని – గోళ్లమూడి మధ్యనున్న గుంటూరు ఛానల్ నీట మునిగిందని, గతేడాదీ అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వందలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కలికంగా గండి పూడ్చే పనులు చేపట్టడంతో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు పొలాలు కొట్టుకుపోయినట్లు తెలిపారు. బుధవారం పంట పొలాలను పరిశీలిస్తే పొలాలు వలె లేవని, సముద్రం మాదిరి మారిపోయినట్లు చెప్పారు. గతేడాది నుంచి కూటమి ప్రభుత్వానికి ఈ కాల్వకు గండిపడుతుందని తెలిసి కూడా నల్లమట్టితో తూతూ మంత్రంగా పనులు ముగించారని ఆరోపించారు. ఇప్పటికే రెండు సార్లు విత్తు పెట్టగా, గతంలో, ప్రస్తుతం వర్షాల ధాటికి కొట్టుకుపోయానని అన్నారు. కాకానిలోని తాగునీటి చెరువును స్థానిక టీడీపీ నేతలు చేపలు కోసం తాగునీటిని బయటకు పంపించారని, ప్రస్తుత వర్షాలకు మురుగునీరు చేరిందని చెప్పారు. ఈ చెరువును శుద్ధి చేయాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందేనని అన్నారు. స్థానిక టీడీపీ నేతల ప్రోద్బలంతోనే నోటి వద్ద మంచినీటిని తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాలు నీట మునిగినా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఇవేమీ పట్టవని మండిపడ్డారు. పొన్నూరు నియోజకవర్గంలోని గ్రామాలన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. గతంలో పంట పొలాలు కోసం తీసుకున్న అప్పులు తీర్చకముందే మరోసారి కురిసిన భారీ వర్షాలకు అప్పులు చేయకతప్పని పరిస్థితి నెలకొందన్నారు. ఆఖరికి జిల్లా స్థాయిలో ఒక్క అధికారి కూడా నీట మునిగిన పంట పొలాలు వైపు కన్నెత్తి చూడలేదన్నారు. విత్తన ఖర్చు కింద రూ.10 వేలు, ఉచితంగా ఎరువులను పంపిణీ చేయాలని అన్నారు. పంట పొలాల్లో పర్యటించి, నీట మునిగిన పొలాల ఫొటోలను ఆయన మీడియా ఎదుట ప్రదర్శించారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబొయిన వేణుగోపాల్, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు భాను పాల్గొన్నారు.
నీట మునిగిన పొలాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ