
గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): భారీ వర్షాలకు గుంటూరు నగరం అతాలకుతలమైంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక పక్క శంకర్‌విలాస్ ఓవర్ బ్రిడ్జి పనులు సాగుతుండటంతో అటుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులంతా కంకరగుంట ఫ్లై ఓవర్ మూడు వంతెనల మీదుగా రావాల్సి ఉంది. వాహనదాల రద్దీ అధికం కావటం, దీనికి తోడు మూడు వంతెనల కింద జలమయం కావటం, కంకరగుంట ఫ్‌లైఓవర్ అండర్ పాస్ సముద్రాన్ని తలపించేలా ఏర్పడటంతో ప్రయాణికులు, వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దీనితో కంకరగుంట బ్రిడ్జి పూర్తిస్థాయిలో వాహనాలతో నిండిపోయింది. హిందూ కళాశాల కూడలిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతాయం కలగటంతో ట్రాఫిక్ పోలీసుల సైతం ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పరిస్థితి సరేసరి. బస్సులు బయటకు వచ్చే క్రమంలో, ఆటోలు అక్కడే నిలిచిపోవటం, సిటి బస్సులు అక్కడే నిలబడిపోవటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కొత్తపేట శివాలయం వద్ద భగత్‌సింగ్ బొమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపించింది. ఏటుకూరు రోడ్డు, పట్నంబజారు, ఏలూరు బజారు, పూలమార్కెట్ సెంటర్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగరంలో సుమారు రెండు గంటలపైనే ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ట్రాఫిక్ పోలీసుల మరమ్మతులు...
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిన నేపథ్యం, కంకరగుంట ఫ్లై ఓవర్‌పై గుంటలు ఏర్పడిన క్రమంలో వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య చొరవ తీసుకున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడటంతో పాటు, ట్రాఫిక్ నెమ్మదిస్తున్న క్రమంలో స్వయంగా ఆయనే, సిబ్బందితో కలిసి బ్రిడ్జిపై ఉన్న గుంటల్లో ఇసుక, కంకరపోసి వాటిని పూడ్చారు.
నగర పాలక సంస్థ అధికారులు బ్రిడ్జిపై గుంతలు పడుతున్నా.. పట్టించుకోకపోవటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వలన ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సీఐ సింగయ్య చొరవను అభినందించారు.
ఒక పక్క శంకర్‌విలాస్ బ్రిడ్జి పనులు వర్షం నేపథ్యంలో నీట మునిగిన కంకరగుంట, మూడు వంతెనల అండర్‌పాస్‌లు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్

గుంటూరులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం