నిజాంపట్నం: మత్స్యకారుల ఇల వేల్పు అయిన మొగదారమ్మ తల్లి సిడిమాను ఉత్సవాలు నిజాంపట్నంలో సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, ఆయన సోదరుడు మోపిదేవి హరనాథబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రమణారావు మాట్లాడుతూ మొగదారమ్మ తల్లి సిడిమాను ఉత్సవాల్ని ఏటా అంగరంగవైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు.
ఉత్సాహంగా జల క్రీడలు
ఉత్సవాలను పురస్కరించుకుని తొలిరోజు ఉత్సాహంగా జల క్రీడలు నిర్వహించారు. ప్రత్యేక వాహనాలపై నీటిని ఏర్పాటు చేసి గ్రామ వీధుల్లో డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో తిరుగుతూ యువత కోలాహలంగా చిమ్ముకుంటూ జల క్రీడల్ని నిర్వహించారు.