
గుంటూరు ఎడ్యుకేషన్ : పరీక్షలపై భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చా కార్యక్రమానికి విద్యార్థులను నమోదు చేసేందుకై బుధవారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ మంగళవారం తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, డైట్ ప్రిన్సిపాల్, సమగ్రశిక్ష సెక్టోరల్ అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులందరు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పరీక్ష పే చర్చా కార్యక్రమ నమోదుకు పూర్తి సమయాన్ని కేటాయించాలని ఆమె ఆదేశించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నమోదు చేయించడం అధికారుల విధుల్లో భాగమని, ఈ విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు ‘చలో కలెక్టర్ కార్యాలయ ముట్టడి’కి అనుమతుల్లేవు
నగరంపాలెం: గుంటూరు జిల్లాలో బుధవారం అంగన్‌వాడీ మహిళలు తలపెట్టిన ‘చలో కలెక్టర్ ఆఫీసు ముట్టడి‘కి ఎటువంటి అనుమతుల్లేవని గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈనెల 3న అంగన్‌వాడీ మహిళలు కలెక్టర్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం విదితమే. దీన్ని ఆసరాగా చేసుకుని, అసాంఘిక శక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ముట్టడికి అనుమతుల్లేవని పేర్కొన్నారు. గుంటూరు నగరంలో 30(పోలీస్ యాక్ట్) అమల్లో ఉందని పేర్కొన్నారు. పోలీస్ ఆదేశాలను ఎవరైనా విస్మరించినట్లైౖతే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ముగిసిన శ్రీరామకోటి మహోత్సవాలు
నగరంపాలెం: స్థానిక సంపత్‌నగర్ శ్రీరామనామక్షేత్ర ఆవరణలో 97వ శ్రీరామకోటి మహోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుగంధ ద్రవ్యాలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన అద్దాల మందిరంలో సీతారాముల పవళింపు సేవతో సుసంపన్నమైనాయి. పవళింపు సేవలో కె.మృణాళిని, మాధవికృష్ణ భక్తి రంజని నిర్వహించారు. శృంగేరి పీఠాధీశ్వరులు, జగత్ గురువులు భారతి తీర్ధ మహాస్వామి, విధుశేఖర భారతి స్వామి వారి దివ్యాశీస్సులతో నిర్వహించగా, రామనామక్షేత్ర గౌరవాధ్యక్షులు పోలిశెట్టి హరిప్రసాద్, ట్రస్టీస్ రాగం వెంకటలీలాసుందరి, మస్తాన్‌రావు దంపతులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు.
యార్డుకు 49,585
బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 49,585 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 47,139 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,500 నుంచి రూ.21,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి 23,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.12,000 నుంచి రూ.20,500 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.13,200 నుంచి 23,200 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.13,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 33,363 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2500, గరిష్ట ధర రూ.3400, మోడల్ ధర రూ.3000 వరకు పలికింది.

