
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ చలానాలు అవసరం లేదని స్పష్టీకరణ
నగరంపాలెం: వినాయక చవితి పండుగ సందర్భంగా పందిళ్లు, మండపాలు, ఊరేగింపులు నిర్వహించేందుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానం అనుసరించాలని సూచించారు. ఉత్సవాలు నిర్వహించే వారు కమిటీగా ఏర్పడాలని అన్నారు. వెబ్‌సైట్‌లో క్లిక్ చేసి అనుమతులు పొందాలన్నారు. తొలుత మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక తర్వాత దరఖాస్తు విండో ఓపెన్ అవుతుందని అన్నారు. దరఖాస్తు సమర్పించిన తర్వాత స్థానిక పోలీసులు ప్రాంగణాన్ని పరిశీలించి, అనుమతులు ఇస్తారని వివరించారు.
దరఖాస్తులో నమోదు చేయాల్సినవి
●దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, చిరునామా,
అసోసియేషన్/కమిటీ పేరు.
●గణేష్ మండపం స్థలం, విగ్రహం/మండపం ఎత్తు.
●పోలీస్ సబ్ డివిజన్, పోలీస్‌స్టేషన్ పరిధి
●ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు.
●గణేష్ నిమజ్జనం తేదీ, సమయం, వాహనాల వివరాలు.
ఎన్‌ఓసీ/ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసే విధానం
కమిటీ సభ్యులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి మొబైల్ నంబర్ నమోదు చేస్తే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఎన్‌ఓసీ/క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసి, లామినేషన్‌తో మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. తనిఖీకి వచ్చే అధికారులు వాటిని పరిశీలిస్తారని వివరించారు.