
విత్తన, పురుగు మందుల షాపుల్లో తనిఖీలు
కొరిటెపాడు (గుంటూరు): నగరంలోని పలు విత్తన, ఎరువులు, పురుగు మందుల షాపుల్లో శుక్రవారం వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ కంపెనీలకు చెందిన రూ.4.85 లక్షల విలువ గల అనుమతులు లేని 168 లీటర్ల పురుగు మందులు, 60 కిలోల పౌడర్‌ల అమ్మకాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా గుంటూరు ఏడీఏ ఎన్.మోహనరావు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలతో పాటు, అనుమతులు లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారాలు చేసే వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎంఆర్‌పీ ధరలకు విక్రయించాలని సూచించారు. విధిగా షాపుల ముందు ధరల పట్టిక, స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ప్రతి వ్యాపారి రిజిస్టరు నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు సుజాత, కిషోర్, సునీత, లక్ష్మి, సుజన బేగం తదితరులు పాల్గొన్నారు.
రూ.4.85 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు నిలిపివేత