
అసెస్‌మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన అసెస్‌మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు మాట్లాడుతూ.. ఈ విధానం కారణంగా విద్యార్థులు 50 నుంచి 70 గంటల బోధనా పీరియడ్స్ నష్టపోతున్నారని, ఆగస్టు నెలలో సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విధానం తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఒకటో తరగతి విద్యార్థికి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం పనికి రాని చర్య అన్నారు. ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశాల నుంచి ఒక్క ప్రశ్న సైతం ఇవ్వకుండా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తురని పేర్కొన్నారు. ఒక్కో పరీక్షకు ఎనిమిది పేపర్లతో ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడం చేయడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షలా ఉందన్నారు. విద్యార్థుల మార్కులు ఐదు చోట్ల నమోదు చేయాలనడం తగదన్నారు. అనంతరం డీఈవో సీవీ రేణుక, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మీనారాయణ, పి.పార్వతి, ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, జి.దాస్, బి.సాయిలక్ష్మి, వెంకటేశ్వరావు, కిషోర్ షా, రాంమోహన్, శివరామకృష్ణ, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.