
యడ్లపాడు: పల్నాడు జిల్లా మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో రానున్న విద్యా సంవత్సరం (2024–25)లో 9,11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఈనెల 15 వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ ఎన్.నరసింహరావు తెలిపారు. ఆయా తరగతుల్లోని మిగులు సీట్ల భర్తీకి నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు పల్నాడు జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ఆన్‌లైన్ పద్ధతిలో www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలన్నీ అందులోనే ఉంటాయన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు నమోదు చేసిన వివరాలు సరి చేసుకునేందుకు ఈనెల 16,17 తేదీల్లో అవకాశం ఉంటుందన్నారు.
ఏపీ గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు ఆహ్వానం
చిలకలూరిపేటటౌన్: ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయటానికి వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని రాజాపేటలో గురుకుల పాఠశాలలో పనిచేయటానికి పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ హిందీ, పీజీటీ సైన్సు, పీఈటీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు ఎమ్మెస్సీ ఫిజికల్ సైన్స్, బీఈడీ, హిందీ పండిట్ కోర్సు, బీఈడీ, డీపీఈడీ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.
యార్డులో 33,089 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 32,243 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 33,089 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,200 నుంచి 24,300 వరకు లభించింది. ఏసీ కామన్ రకం క్వింటాలుకు రూ.8,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.11,000 నుంచి రూ.24,500 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 10,320 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సకాలంలో సర్జరీలు
జరిగేలా చూడాలి
గుంటూరు మెడికల్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వైద్య శిబిరాల్లో ఆపరేషన్లు, స్పెషాలిటీ వైద్య సేవలు కావాల్సిన వారిని గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు చెప్పారు. ఆవిధంగా అవసరమైన వారికి సకాలంలో ఆపరేషన్లు జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని వెల్లడించారు. బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏఎన్‌ఎంలు, ఆశ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అవసరమని గుర్తించిన వారికి డిసెంబర్‌లోపు ఆపరేషన్లు చేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కంటి శస్త్రచికిత్సలు 2,500 మందికి తొలి దశలో చేయాలని గుర్తించామని, జీజీహెచ్‌తోపాటు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కంటి ఆపరేషన్లు జరిగేలా చూడాలన్నారు. రిఫరల్ కేసులు ప్రతి ఒక్కటి చికిత్స పొందేలా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. గర్భిణులకు కన్సివ్ అయిన వెంటనే యాంటినేటల్ రిజిస్ట్రేషన్ చేయించాలని, తద్వారా మాతృమరణాలు సంభవించకుండా నివారించవచ్చునని అన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓతోపాటు, ఎన్‌హెచ్‌ఎం డీపీఎంఓ డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ పాల్గొన్నారు.

