బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి

Mar 18 2026 11:12 AM | Updated on Mar 18 2026 11:12 AM

బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి

జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ

గుంటూరు వెస్ట్‌: సమాజానికి చేటు కలిగించే బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా స్థాయి బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్‌.ఆర్‌. శంకరన్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. గత నవంబరు 27వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబభారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరియైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ బాల్య వివాహిత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమంలో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్‌ సలీం బాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువసార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన పంచాయతీరాజ్‌, పోలీస్‌, రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్‌ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement