అభినందనకు రియల్‌ షాక్‌

ఫిరంగిపురంలో సాయిబృందావన్‌ వెంచర్‌ ఇలా..  - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన అభినందన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ పలువురిని మోసం చేసింది. ఇదేమని ప్రశ్నించిన వారిపై అప్పట్లో అధికారాన్ని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు పాల్పడింది. డబ్బులు కట్టించుకుని తొమ్మిదేళ్లు అయినా కనీసం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. కనీస సదుపాయాలు కల్పించలేదు. దీంతో వారు ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రేరా)ను ఆశ్రయించడంతో వారికి 2016 నుంచి వడ్డీతో సహా అసలును చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సతీమణి మాధవీలత నిర్వహిస్తున్న అభినందన ఎవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సాయి బృందావనం పేరుతో 2013 ఆగస్టులో వెంచర్‌ వేసింది. ఫిరంగిపురం గ్రామంలో సర్వే నంబర్‌ 113, 118/2, 120/1,2, 121/సి1, సి2, డి1, డి2, 122, 123ఎ1,ఎ3, బి, 125/ఎ,బి, 130/ఎ1,ఎ3, 134,136,137/3లోని 63 ఎకరాల్లో 150 చదరపు గజాల ప్లాట్లు వేస్తున్నామని, వీటికి అప్పటి ఉడా అనుమతితో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని బ్రోచర్‌లో ప్రచారం చేసుకున్నారు. మున్సిపల్‌ వాటర్‌, విద్యుత్‌ కనెక్షన్‌, దగ్గరలోనే దేవాలయాలు, స్కూల్స్‌, కళాశాలలు, పెట్రోల్‌ బంక్‌ ఉన్నాయని చెప్పడంతో పలువురు ముందుకు వచ్చి ప్లాట్లు తీసుకున్నారు. సుమారు 63 ఎకరాల్లో వెయ్యికి పైగా ప్లాట్లు వేసి విక్రయించారు. ఒక్కో ప్లాట్‌ 150 గజాలు ఉంటుందని, దీన్ని మూడు లక్షల 60 వేలు వాయిదాల పద్ధతిలో చెల్లించి సొంతం చేసుకోవచ్చని ఊదరగొట్టారు. 2016లోగా వాయిదాలు చెల్లించాల్సిఉంటుందని పేర్కొన్నారు. ఒకేసారి చెల్లించిన వారికి మూడు లక్షల రూపాయలకు, వాయిదాల పద్ధతిలో చెల్లించిన వారికి మూడు లక్షల 60 వేల రూపాయలు చెల్లించాల్సిఉంటుందని, ఆ తర్వాత డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని పేర్కొంది. వీరు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత వీరికి రిజిస్టర్‌ చేయని ఒక సేల్‌అగ్రిమెంట్‌ ఒకదానిని రాయించి ఇచ్చారు. తమకు రిజిస్ట్రేషన్‌ చేయాలని లబ్ధిదారులు ఎన్నిసార్లు అడిగినా వారు ముందుకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన లబ్ధిదారులు ఆర్‌టీఐ యాక్ట్‌ కింద సమాచారం అడిగారు. ఈ లేఅవుట్స్‌కు ఎటువంటి అనుమతులు లేవని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో తమకు అబద్ధాలు చెప్పి మోసం చేశారంటూ లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించారు. సుమారు 17 మంది 2021లో వివిధ తేదీల్లో కోర్టు నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన అభినందన సంస్థ వారు తమకు డెవలప్‌మెంట్‌ చార్జీలు గాని, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కాని చెల్లించనందునే రిజిస్ట్రేషన్‌ చేయలేదంటూ వాదించింది. రేరా (ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) 2017లో వచ్చినందున తమ ప్రాజెక్టు రేరా పరిధిలోకి రాదంటూ వాదించింది. సీఆర్‌డీఏ తమ ప్రాజెక్టును తిరస్కరించినందువల్ల తాము రిజిస్ట్రేషన్‌ చేయలేకపోయామని పేర్కొంది. బాధితులకు ఈ స్థలానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లను వారు చూపించలేదు. పైగా ఆ స్థలాన్ని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కూడా మార్చలేదు. ఇప్పటి వరకూ ఆ లేఅవుట్‌ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం రోడ్లు కూడా వేయలేదు. లే–అవుట్‌ అనుమతులు కూడా తీసుకురాలేదు. లబ్ధిదారులు అన్ని ఆధారాలనూ చూపించడంతో వారికి అనుకూలంగా రేరా తీర్పు ఇచ్చింది. 30 రోజుల్లోగా అన్ని అనుమతులు సంపాదించాలని ఆదేశించింది. లేనిపక్షంలో వారు కట్టిన మొత్తాన్ని ఏడాదికి 14.20 శాతం వడ్డీతో 2016 ఆగస్టు నుంచి చెల్లించాలని అభినందన ఎవెన్యూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను రేరా ఆదేశించింది.లబ్ధిదారులు ఎవరి వద్ద నుంచి డెవలప్‌మెంట్‌ చార్జీలు కట్టించుకోకూడదని తెలిపింది. రెరా నుంచి అన్ని అనుమతులు పొంది, పది నెలల్లోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఫిరంగిపురంలో సాయి బృందావనం పేరుతో వెంచర్‌

అన్ని అనుమతులు ఉన్నాయంటూ ప్లాట్లు అమ్మకం

స్కీం పేరుతో డబ్బులు వసూలు

డబ్బులు కట్టించుకున్నాక అగ్రిమెంట్‌తో సరి

రిజిస్ట్రేషన్‌ చేయకుండా తిప్పుకున్న వైనం

సూత్రధారి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌

అనుమతులు లేవని తేలడంతో రేరాలో ఫిర్యాదు

వడ్డీతో సహా డబ్బులు వెనక్కి

ఇవ్వాలని రేరా ఆదేశం

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top