తేలని తెలంగాణ బీజేపీ గమనం | Telangana BJP president candidate decision still in confusion | Sakshi
Sakshi News home page

తేలని తెలంగాణ బీజేపీ గమనం

May 15 2025 1:12 PM | Updated on May 15 2025 1:12 PM

Telangana BJP president candidate  decision still in confusion

కాంగ్రెస్‌ను ‘కప్పల తక్కెడ’ అని విమర్శించే బీజేపీ (BJP), తెలంగాణ (Telangana) విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్‌ను మించింది. కమలంలో ఎన్ని పువ్వు రేఖలున్నాయో అంత కన్నా ఎక్కువ గ్రూపులున్నా యని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్య చేస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి! ఉన్న ఎని మిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో... అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే! వీరిలో ఒకరంటే మరొకరికి పడదు.

పార్టీ జాతీయ బాధ్యులు కుదించిన రెండు, మూడు పేర్ల జాబితాల్ని అధిష్ఠానానికి సమర్పించినట్టు సమాచారం. పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాల (బీసీ) వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం, అదే ఒరవడిలో బలమైన బీసీ సామా జికవర్గాలను మచ్చిక చేసుకునే ‘సోషల్‌ ఇంజినీరింగ్‌’కు యత్నిస్తోంది. ముది రాజ్, మున్నూరు కాపు (బీసీ), మాదిగ (ఎస్సీ) సామాజికవర్గాలకు ప్రాధాన్యంతో ‘త్రీ–ఎమ్‌ ఫార్ములా’ను ముందుకు తోస్తోంది. మల్కాజ్‌గిరిఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (కరీంనగర్‌) పేర్లను అధినాయకత్వం సీరి యస్‌గా పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకరు ముది రాజ్‌ సామాజికవర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజికవర్గం వారు. బండి సంజయ్‌ ఇది వరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నందున ఈటల రాజేందర్‌ వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత (తొలి నుంచి పార్టీలో ఉన్న), కొత్త (ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన) నాయకుల మధ్య ఉండే స్పర్థ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం పదిసార్లకు తగ్గకుండా సాధా రణ సభ్యుడిగా, కనీసం మూడు పర్యాయాలు క్రియా శీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చ జెప్పడం ద్వారా అధిష్ఠానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా? అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ (సంస్థా గత వ్యవహారాలు), సునీల్‌ బన్సల్‌ (రాష్ట్ర ఇంచార్జీ) వారివైన నివేదికలు పై వారికి (మోదీ–షా ద్వయం) ఇచ్చారు. 

తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఒక్క రాష్ట్రాధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై రెండు, మూడు మాసాలవుతున్నా... రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడివడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు.మండల స్థాయి కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థా గతంగా బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు పార్టీని పటిçష్ఠపరచి, స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడా నికి వీలవుతుంది. అన్ని స్థాయిల్లో మూడోవంతు మహిళలుండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమి టీల్లోనూ ‘త్రీ ఎమ్‌ ఫార్ములా’కు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రాధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్నీ ఓ కొలిక్కివస్తాయి.

అంచనాల స్థాయిలో బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో పుంజు కోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా... ఆ పరిస్థితిని సానుకూలంగా మలచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ‘త్రీ ఎమ్‌ ఫార్ములా’లో భాగమైన మాదిగలను ఆకట్టుకో వడానికి గత ఎన్నికల్లోనే మంద కృష్ణ మాది గను అక్కున చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీక రణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి.

పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్ని కల ప్రకటన చేస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్రాధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్ఠానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్‌ఎస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి, ఏడాది తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని,అందుకే అలా చేశారని చెప్పేవాళ్లూ ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల సంగతెలా ఉన్నా... ఢిల్లీ నాయ కత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పని చేయటం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంటు కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇంచార్జీ బన్సల్‌ మందలించింది కూడా అందుకే! ‘గోడమీద రాతల నుంచి చిన్న పోస్టర్‌ అతికించడం వరకు... అన్నీ డబ్బుమయం అయిపోయాయి తప్ప తెలంగాణలో ఆశించన ఫలితాలు రావట్లేద’ని ఆయన మండిపడటం వెనుక ఎంత నిజముందో పార్టీ రాష్ట్ర నాయకత్వం బేరీజు వేసుకోవాలి.

-దిలీప్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement