శామీర్‌పేట్: ఓఆర్‌ఆర్ రోడ్డుపై పక్కన ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (34) వృత్తి రీత్యా ఓ టీవీ చానెల్ నడుపుతున్నారు. పని నిమిత్తం ఆదివారం రాత్రి టీఎస్ 03 ఎఫ్‌డీ 7688 నంబరు గల ఇకో స్పోర్ట్స్ కారులో నగరానికి వచ్చారు.
రాత్రి మియాపూర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉండి ఉదయం 4:30 నిమిషాలకు ఓఆర్‌ఆర్ మీదుగా తన స్వగృహానికి బయల్దేరాడు. ఈ క్రమంలో శామీర్‌పేట పరిధిలోకి రాగానే కారును రోడ్డు పక్కన ఆపగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారులో పూర్తిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయాడు. సమాచారం అందుకున్న అగి్నమాపక, పోలీసుశాఖ అధికారులు మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారారని, క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. ఆగి ఉన్నపుడే మంటలు వ్యాపించినట్లు గుర్తించామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ వెల్లడించారు.


