బడా వ్యాపారులకే ‘బ్యాడ్‌ బ్యాంక్‌’

Senior Financial Analyst Anindyo Chakravarti Article On Bad Bank - Sakshi

బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్, ఎస్బీఐ, పీఎన్బీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేయాలని లేక అమ్మివేయాలని కోరుకుంటున్న పార్లమెంటరీ పండితులు వాస్తవానికి ఏకాంతంలో ఉన్న సోషలిస్టులు అని చెప్పాలి. సోషలిజం అనేది బడా వ్యాపార వర్గాలకోసం ప్రత్యేకించినంత కాలం వీరు సోషలిజాన్ని గాఢంగా ప్రేమిస్తారు. అయినా సోషలిజం అంటే అర్థం ఏమిటి? పెట్టుబడులు, వనరులపై సామాజిక యాజమాన్యమే కదా. మనం సోషల్‌ అని చెబుతున్నప్పుడు తప్పనిసరిగా దాన్ని ప్రభుత్వ లేక రాజ్య యాజమాన్యం అనే అర్థంలోనే తీసుకుంటాం మరి. ప్రైవేట్‌ కంపెనీలు నిరర్థక పెట్టుబడులను పెడతాయి. నిష్ఫలమైన వ్యాపార నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ వాటి ఫలితాన్ని మాత్రం పన్ను చెల్లింపుదారులే తప్పకుండా భరించాల్సి వస్తోంది.

సాంప్రదాయికంగా, కంపెనీలపై, ఆస్తులపై ప్రభుత్వ యాజమాన్యం అనే భావనను ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలే పెంచి పోషించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండరాదని వీరు చెబుతుంటారు. కానీ ఈ వ్యాపారస్తులు పెట్టుబడులపై తప్పుడు నిర్ణయాలు తీసుకుని, భారీ నష్టాలకు కారకులై సంస్థ మూలాలను క్షీణింపచేస్తే ఏం చేయాలి? ఇక్కడే మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు రంగంలోకి దిగి ఈ కంపెనీలను ప్రభుత్వం స్వాధీనపర్చుకుని వారిని శిక్షించకుండా వదిలేయాలని చెప్పేస్తుంటారు. దీని ఫలితమేంటి? పెట్టుబడిదారుల కోసం సోషలిజాన్ని ఆచరించడమే కదా!

ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అక్షరాలా ఇలాంటి సోషలిజమే. టెలికాం రంగ సంస్కరణల రూపంలో మొట్టమొదటి అమ్మకం జరిగిపోయింది. ఈ సంస్కరణల సారం ఏమిటి? టెలికాం రంగంలో ప్రైవేట్‌ కంపెనీలు మరింతమంది వినియోగదార్లను చేజిక్కించుకునే పరుగుపందెంలో కారుచౌక ధరలకు స్పెక్ట్రమ్‌ కొనుగోలు, ఎయిర్‌ వేవ్స్‌ అమ్మకాలకోసం భారీ మదుపులు పెడుతూ ఉంటాయి. రిలయన్స్, జియో రంగంలోకి వచ్చి టెలికాం రంగ పరిస్థితిని మార్చివేయడానికి ముందుగానే ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి సంస్థలు రాయితీలతో కూడిన ప్యాకేజీలు ప్రతిపాదించి, అసంఖ్యాక జీబీలకొద్దీ డేటాను ఉపయోగించుకుంటూ, సుదీర్ఘ ఫోన్‌ కాల్స్‌ చేసుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవి. అయితే తన వినియోగదారులకు పరిమిత కాలానికి ఉచిత డేటా ఇస్తానని ప్రతిపాదించడం ద్వారా రిలయన్స్‌ జియో తన పోటీ కంపెనీల కాళ్లకింది భూమిని లాగిపడేసింది.

జియో శరవేగంగా విస్తరించడం ప్రారంభించగానే, ఇతర బడా టెలికాం కంపెనీలు కూడా ఇదేరకమైన తాయిలాలను అందించడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. దీంతో వినియోగదారునుంచి వచ్చే సగటు రాబడి పడిపోయింది. పైగా డేటా వినియోగం పెరిగిపోయింది. దీంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కంపెనీలు అనేక త్రైమాసికాల పాటు భారీ నష్టాల బారినపడ్డాయి. జియోతో నేరుగా తలపడుతూ వొడాఫోన్, ఐడియా  సంస్థలు విలీనమైనప్పుడు, భారత్‌లోనే అతిపెద్ద టెలికాం కంపెనీ (వీఐ) ఆవిర్భావానికి నాంది అయ్యింది. కానీ జియో ప్రత్యేకమైన బిజినెస్‌ నమూనాని పాటించడమే అసలు సమస్య అయింది.  దీంతో జియో విజృంభణ ముందు నిలబడలేక, వొడాఫోన్‌–ఐడియా లేదా వీఐకి ఇప్పటికీ రక్తమోడటమే తప్ప మరొక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడది రూ. 1.9 లక్షల కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంస్కరణలకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే మరి.

అయితే, నాలుగేళ్ళ రుణ విరామ సమయం తర్వాత కూడా టెలికాం కంపెనీలు తమ బకాయిలను చెల్లించలేకపోతే, ఇవి ప్రభుత్వానికి ఈక్విటీల రూపంలో చెల్లించవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో వొడాఫోన్‌–ఐడియా ప్రభుత్వ కంపెనీగా మారే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు మొదలైపోయాయి కూడా. ఇన్నాళ్లుగా ప్రభుత్వ రంగం అసమర్థంగా ఉందని, ప్రైవేట్‌ రంగం అత్యంత సమర్థంగా పనిచేస్తోందని మనం వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజా ప్రయోజనాల రీత్యా వొడాఫోన్, ఐడియా సంస్థ మూతపడటాన్ని అనుమతించకూడదని మనకు చెబుతున్నారు. ఇప్పటికీ అనేకమంది చందాదారులను కలిగిన ఈ సంస్థను కాపాడాల్సిన అవసరముందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అది కూడా ప్రజా శ్రేయస్సు పేరిట పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించాలట.

కాబట్టి ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు నిరర్థక పెట్టుబడులు పెడతాయి, నిష్ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రజలు మాత్రం పన్ను చెల్లింపుదారులుగా వాటిని తాము చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే ప్రకటించిన బ్యాడ్‌ బ్యాంక్‌ అనే రూపంలోని మరొక సాహసోపేతమైన సంస్కరణ వెనుకఉన్న ఆలోచన కూడా ఇదే మరి. రెగ్యులర్‌ వాణిజ్య బ్యాంకుల ఖాతాల్లో పేరుకుపోయిన 2 లక్షల కోట్ల రూపాయల నిరర్థక రుణాలను ఈ బ్యాడ్‌ బ్యాంకు తీసుకుం టుంది. నిర్దిష్ట కాలంలో వాటిని రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఇదెలా పనిచేస్తుంది? వ్యాపారంలో విఫలమైన కంపెనీకి కొన్ని బ్యాంకుల సముదాయం రూ. 500 కోట్లను రుణంగా ఇచ్చిందని ఊహిద్దాం. ఇలా విఫలమైన కంపెనీకి తామిచ్చిన రుణం తిరిగి రాబట్టుకోవడంపై బ్యాంకులకు ఏమాత్రం ఆసక్తి లేదనుకోండి. అప్పుడు ఈ రూ. 500 కోట్ల రుణాన్ని అవి  రూ. 300 కోట్లకు అమ్మేయాలని నిర్ణయించుకుంటాయి. అంటే ఏకకాలంలో బ్యాంకులు 200 కోట్ల రూపాయలను నష్టపోతాయి. కానీ తాము ఇచ్చిన రుణంలో 60 శాతాన్ని పొందుతాయి. బ్యాడ్‌ బ్యాంక్‌ ఇలా నష్టపోయిన కంపెనీ ఆస్తులను తీసుకుని తాను బ్యాంకులకు చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తానికి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ఇక బ్యాంకులు తాము తీసుకున్న రుణాల్లో కొంత భాగాన్ని రద్దు చేసుకుని తమ ఖాతా పుస్తకాలను క్లీన్‌ చేసుకుంటాయి.

తొలిదశలో బ్యాడ్‌ బ్యాంక్‌ దాదాపు రూ. 90,000 కోట్ల మొండి బకాయిలను తీసుకుంటుందని భావిస్తే, దానికి చాలా మొత్తం నగదు అవసరమవుతుంది. తమ మొండి బకాయిలను బ్యాడ్‌ బ్యాంకుకు అమ్మివేసిన బ్యాంకులకు కనీసం 15 శాతం డబ్బు నగదు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాలు సెక్యూరిటీ రిసిప్టులుగా ఉంటాయి. బ్యాడ్‌ బ్యాంకు తాను చేసిన వాగ్దానం మేరకు డబ్బు చెల్లించకలేకపోతే భారత ప్రభుత్వం దాన్ని పూరించి సార్వభౌమాధికార గ్యారంటీతో ఈ రిసిప్టులకు మద్దతిస్తుంది.

అయితే దీనివల్ల లాభపడేది ఎవరు? మొండి బకాయిల్లో మెజారిటీని తమ స్వాధీనంలో ఉంచుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులే లాభపడతాయని పైకి కనిపిస్తుంది కానీ, వాస్తవానికి బడా కార్పొరేట్‌ సంస్థలే అతిపెద్ద లబ్ధిదారులుగా ఉంటాయి. తమ ఖాతాల నుంచి మొండి బకాయిలను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే ఈ బ్యాంకులు కార్పొరేట్లకు సులువుగా రుణాలు ఇవ్వగలుగుతాయి. దీంతో అవి ఆచరణాత్మక అంచనాలతో పనిలేకుండానే మళ్లీ జూదమాడటం మొదలెడతాయి. ఈ బడా కంపెనీలే తొలి దశలో దేశంలో మొండి బకాయిల సంక్షోభానికి అసలు కారకులు అనే విషయం మర్చిపోకూడదు. మరోమాటలో చెప్పాలంటే, ఈ బ్యాంకింగ్, టెలికాం సంస్కరణలు ‘సోషలిజం’ నూతన రూపమే తప్ప మరొకటి కాదు. కానీ ఈసారి మాత్రం ఈ సోషలిజం ప్రత్యేకించి పెట్టుబడిదారులకే వర్తిస్తుంది.

బ్యాడ్‌ బ్యాంక్‌ అంటే ఏమిటి?
దేశంలో తొలి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంతో గత నాలుగేళ్లుగా దీనిపై సాగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లయింది. గత ఏడాది బడ్జెట్లోనే నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) గురించి ప్రస్తావించారు. ఇంతకీ బ్యాడ్‌ బ్యాంక్‌ అంటే ఏమిటి? దేశంలో వ్యాపారసంస్థల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలను తీసుకుని వాటికి పరిష్కారం చూపే ఒక రకమైన ఆర్థిక సంస్థ బ్యాండ్‌ బ్యాంక్‌. కంపెనీలు పేరుకుపోయిన మొండిబకాయిలను ఈ బ్యాడ్‌ బ్యాంకుకి అప్పగిస్తే వాటిని ఎన్‌ఏఆర్‌సీఎల్‌ స్వాధీనపర్చుకుని వాటిని మార్కెట్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుంది. కంపెనీలు కాస్త నష్టానికి తమ అప్పులను బ్యాడ్‌ బ్యాంకుకు స్వాధీనపరిస్తే, వాటిని అధిక ధరకు అమ్మడంద్వారా లబ్ధిపొందాలనేది బ్యాడ్‌ బ్యాంక్‌ లక్ష్యం. మొత్తం ఎలా పరిణమిస్తుందనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.
-అనింద్యో చక్రవర్తి, సీనియర్‌ ఆర్థిక విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top