స్ట్రీట్‌ ఫుడ్‌.. ఆ ‘పాత’ మధురమే..

Sakshi Guest Column On Street Food

సారాంశం

సరికొండ చలపతి 

కుమారి ఆంటీ ఒక్కసారి మన చూపులన్నీ స్ట్రీట్‌ ఫుడ్‌ వైపు మరోసారి లాగేసింది కానీ, వీధిలో నిలబడి  ఓ కప్పు చాయ్, ఓ సాయంత్రం నాలుగు ప్లేట్ల పానీపూరీ విత్‌ ప్యాజ్, కాసింత చాట్‌ .. బాగా వేయించిన ఫిష్‌ ఫ్రై.. గరం గరం మిర్చి బజ్జీలు, వేడివేడి ఇడ్లీలు, వావ్‌ అనిపించే వడాపావ్‌లు.. తినని సగటు జీవి ఉంటాడా..∙మన రోడ్లన్నీ ఘుమ ఘుమలాడే రెస్టారెంట్లే కదా.. మన కడుపు నింపే వారి  కడుపు నింపుకొని నలభీములు తిరుగాడే ప్లేస్‌లే కదా..  పల్లె, పట్నం తేడా లేదు. వెజ్‌ నాన్‌ వెజ్‌ తేడాల్లేవు.

ఎక్కడికివెళ్లినా రోడ్డు టిఫిన్‌  సెంటర్ల నుంచి  మినీ ‘స్ట్రీట్‌ హోటళ్ల’ దాకా ఎన్నో .. ధరలు తక్కువ.. ఉన్నంతలో రుచీ ఎక్కువే. అయితే స్ట్రీట్‌ ఫుడ్‌కు.. రామాయణ, మహాభారతాలకు ఉన్నంత చరిత్ర ఉంది. ఆనాటి నుంచే నగరాల్లోని వీధుల్లో ‘వేయించిన గింజలు, రొట్టెలు’ వంటివి అమ్మేవారట. పాత రుచులపై మొహం మొత్తిన కొద్దీ, జనం పెరిగిన కొద్దీ.. మెల్లగా కొత్త కొత్త రుచులు పుట్టుకొచ్చాయి. స్థానిక ఆచారాలు, ఆహార అలవాట్లను బట్టి ఎక్కడికక్కడ కొత్త వెరైటీలు మొదలయ్యాయి.

షాజహాన్‌ చాట్‌ ...
మొఘలుల కాలం నాటికి స్ట్రీట్‌ ఫుడ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. షాజహాన్‌  ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు.. వర్తకులు, రోజువారీ పనిచేసుకునేవారు మధ్యాహ్నం కడుపు నింపుకోవడానికి వీలుగా ‘చాట్‌’ స్టాల్స్‌ను ఏర్పాటు చేయించాడని అంటారు. అలా మొదలైన ‘చాట్‌’ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. 

గ్రీస్‌ .. ఫ్రై ఫిష్‌..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గ్రీస్‌ సామ్రాజ్యంలో పది వేల ఏళ్ల కిందే ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ అమ్మకాలు మొదలయ్యాయట. ప్రధాన రహదారుల పక్కన ్రౖఫై  చేసిన చేప ముక్కలను అమ్మేవారట. తర్వాత ఇది రోమ్‌కు విస్తరించిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాడు ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ ధనవంతులకేనని, వారు ఇళ్లలో వండుకోకుండా తెప్పించుకుని తినేవారని అంటున్నారు. తర్వాత నగరాలు విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ.. ‘స్టాల్స్‌’ పెరిగిపోయి పేదల ఫుడ్‌గా మారింది.

ఈజిప్ట్‌ బ్రెడ్‌..
► క్రీస్తుపూర్వం 1200వ సంవత్సరం సమయంలోనే ఈజిప్ట్‌లోని సిర్సా నగర వీధుల్లో గోధుమ రొట్టెలను అమ్మినట్టు పురాతత్వ తవ్వకాల్లో గుర్తించారు.

స్టూడెంట్స్‌కు నంబర్‌ వన్‌
స్ట్రీట్‌ ఫుడ్‌ ఏనాడో భారత సంస్కృతిలో, చరిత్రలో ఓ భాగమైపోయింది. మెల్లగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకూ విస్తరించింది. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనిచేసుకునేవారు, ఏదో ఓ పనిపై బయటికి వెళ్లేవారు.. ఇలా అందరికీ ‘స్ట్రీట్‌ స్టాల్స్‌’తోనే కడుపు నిండేది. ఇలాంటి వారు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో.. అలాంటి ప్రాంతాలన్నీ స్ట్రీట్‌ ఫుడ్‌కు అడ్డాలే.

► ఇటీవల వారణాసిలో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం స్పష్టమైంది. 25–45 ఏళ్ల మధ్య వయసువారిలో 42 శాతం, 14–21 ఏళ్ల మధ్య వయసువారిలో 61 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థులు మధ్యాహ్నం పూట ‘స్ట్రీట్‌ ఫుడ్‌’తోనే బండి లాగించేస్తామని చెప్పడం గమనార్హం.
► రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్‌ వ్యవసాయ, సాంకేతిక వర్సిటీ విద్యార్థుల ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ అలవాటుపై ఇటీవల ఓ సర్వే జరిగింది. రుచిగా, ధర తక్కువగా ఉండ టం, త్వరగా తినేయగలగడం, స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తినడం వల్ల ‘స్ట్రీట్‌ ఫుడ్‌’కు ప్రాధాన్యత ఇస్తామని 88.3 శాతం మంది యువకులు, 90 శాతం మంది యువతులు వెల్లడించారు. 

ఫుడ్‌ పెట్టే... స్ట్రీట్‌
స్ట్రీట్‌ఫుడ్‌ విక్రయించేవారు.. అందరి కడుపు నింపుతూ, తామూ పొట్టపోసుకుంటున్నారు. మన దేశంలో స్ట్రీట్‌ ఫుడ్‌తో ఉపాధి పొందుతున్నవారు కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే 60 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ నగరాల్లో రోజూ ఓ పూట బయటే తిని బతుకు వెళ్లదీస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు.

► ఇలా అమ్మేవాళ్లు, తినేవాళ్లు కలసి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ ఓ చెయ్యి వేస్తున్నారు. దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌ రోజువారీ వ్యాపారం విలువ రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి రూ.30 లక్షల కోట్లపైమాటే.
► దేశంలో ప్రాంతాన్ని బట్టి 2 శాతం నుంచి 10 శాతం మంది జనాభా స్ట్రీట్‌ ఫుడ్, దానిపై ఆధారపడిన పనులతోనే ఉపాధి పొందుతున్నారు.

సాటి లేని వెరైటీ..
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే తేడా లేదు.. సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, పానీపూరీ, చాట్, ఇడ్లీ, దోశ వంటివాటితోపాటు కబాబ్‌లు, ఫ్రైడ్‌ రైస్‌లు, బిర్యానీల దాకా ‘స్ట్రీట్‌
స్టాల్స్‌’లో దొరకని వెరైటీలంటూ లేవు. 

జిలేబీ వంటి స్వీట్లనూ అలా రోడ్డుపక్కన నిలబడి లాగించేయొచ్చు. స్ట్రీట్‌ ఫుడ్‌లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ నగరానికి ఆ నగరమే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోహా, జిలేబీ కాంబినేషన్‌  ఊరిస్తే.. ముంబైలో వడాపావ్‌ నోరూరిస్తుంటుంది. యూపీలో ఆలూ టిక్కీ ఆకర్షిస్తే.. కోల్‌కతా నగర వీధుల్లో చేపల ఫ్రై, కబాబ్‌ రోల్స్‌ రారమ్మని పిలుస్తుంటాయి.

► ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకెల్లా ఇండియాలో ఫుడ్‌ వెరైటీలు ఎక్కువ. పదో, ఇరవయ్యో కాదు.. స్ట్రీట్‌ఫుడ్‌లోనే వందల రకాలు ఉన్నాయి మరి.

స్ట్రీట్‌ ఫుడ్‌ పండుగే..
‘నోయిడా ఉత్సవ్‌’.. ఇక్కడ అన్ని స్ట్రీట్‌ ఫుడ్‌లు దొరకబడును!
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఏటా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ‘నోయిడా ఉత్సవ్‌’ స్ట్రీట్‌ఫుడ్‌కు వెరీ స్పెషల్‌. ‘నేషనల్‌ అసోసియేషన్‌  ఆఫ్‌ స్ట్రీట్‌ వెండార్స్‌ ఆఫ్‌ ఇండియా (నస్వీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవంలో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్నమైన స్ట్రీట్‌ ఫుడ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి. 
ఆహా.. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..!

whatsapp channel

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top