విశ్లేషణ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర మైన సమస్యగా మారాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు, జీవ వైవిధ్యం వంటివాటిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణాలు వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, పట్టణీకరణ, అధిక కాంక్రీటీకరణ, వాహన కాలుష్యం, నీటి వనరుల క్షీణత. ముఖ్యంగా నగరాల్లో ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావం కారణంగా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు అధిక ప్రమాదంలో ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా మరింత ప్రభావితమవుతోంది. నీటి కొరత, నేల తేమ తగ్గుదల, పంటల ఉత్పాదకతలో తగ్గుదల కనిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా, వాతావరణ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా మారింది. ఉష్ణోగ్రత సమస్యను పరిశీలిస్తే, ఐసీసీసీ (2025) గణాంకాల ప్రకారం, ప్రపంచ ఉష్ణోగ్రత ఇప్పటికే పారిశ్రామిక విప్లవానికి ముందు స్థాయుల కంటే సుమారు 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఇది తీవ్రమైన వడగాల్పులు, వరదలు, కరవులు, అటవీ కార్చిచ్చులు, హిమనీనదాలు కరిగిపోవడం, సముద్ర మట్టం పెరగడానికి దారితీస్తోంది. మరో ముఖ్యమైన సంస్థ అయిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్‌ఓ) నివేదిక ప్రకారం 2015, 2025 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యంత వేడి సంవత్సరాలుగా నిలిచాయి. గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు కొనసాగితే, రాబోయే దశాబ్దాలలో భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కీలక పరిమితిని దాటిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
1901–1910 సగటుతో పోలిస్తే భారతదేశంలో ఉష్ణోగ్రతలు సుమారు 1.2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉన్నాయని కూడా ఐఎమ్‌డీ వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే, ఈ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో తీవ్రమైన వడగాల్పులు 5 నుండి 8 రెట్ల వరకూ పెరగవచ్చని అధ్యయనాలు సూచి స్తున్నాయి. వాతావరణ మార్పు వ్యవసాయం, నీటి వనరులు, ప్రజారోగ్యం, జీవవైవిధ్యం, పట్టణ మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, వాతావరణ మార్పులను తట్టు కోగల మౌలిక సదుపాయాలు, సర్దుబాటు చర్యల కోసం 2050 నాటికి భారతీయ నగరాలకు 2.4 ట్రిలియన్ డాలర్లకు పైగా అవసరం కావచ్చు.
ప్రపంచ వాతావరణ మార్పుల ప్రభావంతో భారతదేశంలో మే నెలలో మాములు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న రోజులు నమోదవుతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పర్యావరణ హిత జీవితం
ఈ పరిస్థితిని నియంత్రించడానికి సమగ్ర చర్యలు అవసరం. మొదట భారీ స్థాయిలో చెట్లు నాటాలి. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి సహజ శీతలీకరణ వ్యవస్థలుగా పనిచేస్తాయి. చెరువులు, కుంటలు, నీటి వనరులను పరిరక్షించడం అత్యంత అవసరం. ‘మిషన్ కాకతీయ’ వంటి కార్యక్రమాల ద్వారా చెరువులను పునరుద్ధరిస్తే భూగర్భజలాలు పెరగడంతో పాటు స్థానిక ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. అలాగే పట్టణాల్లో వాతావరణ అనుకూల ప్రణాళికలను అమలు చేయాలి. గ్రీన్ రూఫ్‌లు, చల్లని పైకప్పులు, నీడనిచ్చే చెట్లు, ఓపెన్ గ్రీన్‌స్పేస్‌లు పెంచడం ద్వారా నగర ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చు. వాహన, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ కూడా కీలకం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పరిశ్రమలపై కఠిన కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి. పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు.
వ్యవసాయ రంగం వాతావరణ మార్పులకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. తక్కువ నీటితో పండే పంటలు, డ్రిప్ ఇరిగేషన్, నేల తేమ పరిరక్షణ, అగ్రో ఫారెస్ట్రీ వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. రైతులకు వాతావరణ సమాచారం అందించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ప్రజలు కూడా విద్యుత్ పొదుపు, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసి చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ప్రస్తుత తరం వాతావరణ సమస్యల నుంచి విముక్తి పొందుతుంది. భవిష్యత్ తరా లకు సురక్షితమైన పర్యావరణ ం అందుతుంది.
డా‘‘ పారుపల్లి ఆంజనేయులు
వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్) రిసెర్చ్ అసోసియేట్


