భీమా కోరేగావ్‌... ఓ అన్యాయ గాథ | Sakshi Guest Column On Bhima Koregaon | Sakshi
Sakshi News home page

భీమా కోరేగావ్‌... ఓ అన్యాయ గాథ

Published Wed, Jun 19 2024 5:29 AM | Last Updated on Wed, Jun 19 2024 5:29 AM

Sakshi Guest Column On Bhima Koregaon

విశ్లేషణ

భీమా కోరేగావ్‌ (మహారాష్ట్ర) కేసు మొదలై ఆరేళ్లవుతోంది. అక్కడ జరిగిన అల్లర్లకు కారణం కావడంతోపాటు, నిషేధిత మావోయిస్టు సంస్థ సభ్యులుగా ఉండి, ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ 16 మందిని పుణె పోలీసులు ‘ఉపా’ కింద అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో న్యాయవాదులు, విద్యావేత్తలు, రచయితలు, కవులు, గాయకులు ఉన్నారు. వీరిలో ఎవరూ దోషులుగా తేలకుండానే, కనీసం విచారణనైనా ఎదుర్కో
కుండా చాలా సంవత్సరాలు జైల్లో గడిపారు. కొందరు అతి కష్టం మీద బెయిల్‌ పొందారు, కొందరు ఇంకా జైల్లోనే ఉన్నారు. అయినా ఇప్పటికీ వారి మీద తుది అభియోగాలు మోపలేదు. విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఇలా ఏ ప్రజాస్వామిక దేశంలో అయినా జరుగుతుందా?

గుజరాత్‌కు చెందిన అల్పా షా నైరోబీలో పెరిగింది. నా దివంగత భార్య మెల్బా కూడా అక్కడే జన్మించి, పదేళ్ల వరకు అక్కడ ఉంది. కెన్యాలోని మౌ మౌ ఉద్యమం కారణంగా భారతీయ సంతతికి చెందిన అనేక కుటుంబాలు ఆ దేశాన్ని విడిచి రావలసి వచ్చింది. అలా భారత్‌కు వచ్చినవారిలో గోవాకు చెందిన నా భార్య వాళ్ల మెనెజెస్‌ కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్లు గోవాకు వస్తే, అల్పా ఇంగ్లండ్‌కు వలస వెళ్లింది.

అల్పా కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. ప్రస్తుతం ఆంత్రోపాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ‘నైట్‌మార్చ్‌’, ‘ఇన్‌ ది షాడోస్‌ ఆఫ్‌ ద స్టేట్‌’ పుస్తకాలు రాశారు. ఆమె ఇటీవలి పుస్తకం ‘ది ఇన్‌కార్సెరాషెన్స్‌: భీమా కోరేగావ్‌ అండ్‌ ద సెర్చ్‌ ఫర్‌ డెమోక్రసీ ఇన్‌ ఇండియా’ మానవ హక్కుల కోసం పరితపించే ఈ నిబద్ధ యోధురాలిని నాకు పరిచయం చేసింది. అల్పా రాసిన ‘ఇన్ కార్సెరాషెన్స్‌...’ (నిర్బంధాలు) మార్చిలో ప్రచురితమైంది. 

నిషేధిత మావోయిస్టు సంస్థ సభ్యులుగా ఉండి, ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర పన్నినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది వ్యక్తిగత చరిత్రను అల్పా పరిశీలించారు. మోదీని చంపేందుకు కుట్ర పన్నారనే ఆరోపణను కేసు తీవ్రత కోసం జోడించినట్లు కనిపిస్తోంది. విచారణ సమయంలో ఈ ఆరోపణ పునరావృతం కాలేదు.

భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన వారిలో న్యాయవాదులు, విద్యావేత్తలు, రచయితలు, కవులు, గాయకులు కూడా ఉన్నారు. వీరిలో కబీర్‌ కళా మంచ్‌ కవి సుధీర్‌ ధావలే, గాయకులు రమేశ్‌ గాయీచోర్, సాగర్‌ గోరఖే, జ్యోతి జగ్‌తాప్‌ వంటివారు కేసులోని ఇతరులకు తెలియనే తెలియదు. వీరిలో ఎవరూ దోషులుగా తేలకుండానే, చాలా ఏళ్ళు జైల్లో గడిపారు. క్రూరమైన ‘ఉపా’ (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కింద వారిని అరెస్టు చేసినందున, ఈ ప్రక్రియే శిక్షగా మారింది. ఉపా కేసుల్లో బెయిల్‌ పొందడం దాదాపు అసాధ్యం. భీమా కోరేగావ్‌ నిందితులపై తుది అభియోగాలు ఇంకా రూపొందించలేదు. 2018లో మొదటి అరెస్టులు జరిగాయి. కొందరు బెయిల్‌పై ఉన్నారు, కొందరు ఇంకా జైలులో ఉన్నారు. వారి మీద సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదు.

‘జైలు కాదు, బెయిల్‌’ అనేది సుప్రీంకోర్టును అలంకరించిన అత్యంత గౌరవనీయమైన న్యాయనిపుణులలో ఒకరైన జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ నిర్దేశించిన సూత్రం. ఆయన అన్నయ్య వీఆర్‌ లక్ష్మీనారాయణన్‌ నా ఐపీఎస్‌ సహోద్యోగి. సీబీఐలో పనిచేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్పే సందర్భాల కోసం తెచ్చిన ఉపాను వాస్తవ ఆచరణలో, అన్యాయానికి సాధనంగా మార్చేశారు. 

ఉపా కింద నిర్బంధానికి గురైన 16 మంది కార్యకర్తలు వివిధ వర్గాలకు చెందినవారు. ఇందులో నలుగురు క్రైస్తవులు: ఫాదర్‌ స్టాన్‌ స్వామి (ఇప్పుడు మరణించారు), తమిళనాడులోని ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన జెసూట్‌ మతగురువు వెర్నాన్‌ గోంసాల్వేస్, ముంబైకి చెందిన అరుణ్‌ ఫెరీరా, కేరళకు చెందిన రోనా విల్సన్‌. ముస్లిం అయిన హనీ బాబు కూడా కేరళకు చెందినవారే. 

ఈ కేసులో ఏడుగురు దళిత హక్కుల కార్యకర్తలు ఉన్నారు: దళిత దిగ్గజం బీఆర్‌ అంబేడ్కర్‌ మనమరాలు రమను వివాహం చేసుకున్న ఆనంద్‌ తేల్‌తుంబ్డేతో పాటు జ్యోతి జగ్‌తాప్, సాగర్‌ గోరఖే, రమేశ్‌ గాయీచోర్, సుధీర్‌ ధావలే, సురేంద్ర గాడ్లింగ్, షోమా సేన్‌ ఈ కేసులో భాగం. మిగిలిన నలుగరు అగ్రకుల హిందువులు. ఇందులో సుధా భరద్వాజ్‌తో పాటు, మహేశ్‌ రావూత్‌ (గడ్చిరోలికి చెందిన అటవీ హక్కుల కార్యకర్త), మానవ హక్కుల కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖా (వీరి భాగస్వామి సభా హుస్సేన్‌ మహిళా హక్కుల కార్యకర్త), హైదరాబాద్‌కు చెందిన వామపక్ష కవి వరవరరావు ఉన్నారు. ఈయన తన కవితలు, కార్యకలాపాలకుగాను గతంలోనూ జైలులో ఉన్నారు.

సుధా భరద్వాజ్, ఫాదర్‌ స్టాన్‌ స్వామి గిరిజన హక్కుల కోసం పోరాడారు. సుధ అమెరికాలో విద్యావేత్తలైన భారతీయ తల్లిదండ్రులకు జన్మించారు. కాన్పూర్‌ ఐఐటీలో చదువుకున్నారు. ఆమెకు అమెరికా పాస్‌పోర్ట్‌ ఉంది. చట్ట పరిధిలో హక్కుల కోసం పోరాడుతున్న గిరిజనులతో తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న తర్వాత తన పాస్‌పోర్టును అప్పగించారు. బాంబే హైకోర్టు విడుదల చేయడానికి ముందు ఆమె మూడేళ్లు జైలు జీవితం గడిపారు. 

ఛత్తీస్‌గఢ్‌లో తమ భూమిని కోల్పోయిన గిరిజనుల పక్షాన వాదించడమే ఆమె చేసిన ఏకైక ‘నేరం’. ఫాదర్‌ స్వామి నాయకత్వంలో గిరిజనులు అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా తమ హక్కులపై అవగాహన పెంచుకున్నారు. ఈ చట్టాలు గిరిజనుల భూముల్లో ఇనుప ఖనిజం, బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు వారిని పురికొల్పాయి. ఫాదర్‌ స్వామి ప్రేరేపణతో జార్ఖండ్‌లోని హో గిరిజనులు లేవనెత్తిన అభ్యంతరాల వల్ల చాలా కార్పొరేట్‌ గ్రూపులు దెబ్బతిన్నాయి. ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలోనే మరణించారు (2021).

ఆనంద్‌ తేల్‌తుంబ్డే ఒక ఇంజినీర్‌. ప్రభుత్వ రంగంలో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి సంస్థ అయిన పెట్రోనెట్‌ ఇండియాకు సీఈఓగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులు కాకముందు భారత్‌ పెట్రోలియంలో రెండు దశాబ్దాలు పనిచేశారు. పదవీ విరమణ చేసే ముందు ముంబై విశ్వవిద్యాలయం నుండి మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డి పొందారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని వినోద్‌ గుప్తా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా చేరారు. తాను ఏ నేరం చేయలేదని చెప్పినప్పటికీ ఆయనను పుణె పోలీసులు గోవాలో పట్టుకున్నారు. 

పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్‌తుంబ్డేకు వ్యతిరేకంగా అందించిన ఏకైక సాక్ష్యం ఆయన కంప్యూటర్‌ నుండి సేకరించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, మావోయిస్టులతో లింకులు ఉన్నట్లు అనుమానించిన మరికొందరి నుండి సేకరించిన ఉత్తరప్రత్యుత్తరాలు. వాటిని అందరూ తిరస్కరించారు. దళితులు, ఆదివాసీలు నయా ఉదారీకరణ, ప్రపంచీకరణ నుండి ప్రయోజనం పొందలేదని చూపించడానికి దేశవ్యాప్తంగా డేటాను విశ్లేషించడంపై తేల్‌తుంబ్డే ఆసక్తి చూపించారు. దళితులను, ఆదివాసీలను హిందూ మతంలోకి చేర్చడానికి సంఘ్‌ పరివార్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇది విరుద్ధం. అయితే సుధ, ఫాదర్‌ స్వామి, తేల్‌తుంబ్డే, షోమా సేన్‌ వంటి ఉద్యమకారుల ప్రయత్నాలు కులానికి, తెగలకు సంబంధించిన వివక్ష సమకాలీన భారతదేశంలో నియమంగా ఉంటోందని నిరూపించాయి.

అల్పా రాసిన పుస్తకం సమకాలీన భారత రాజకీయాలపై అధ్యయనం చేస్తున్న విద్యార్థులందరూ తప్పక చదవవలసినది. బాధితుల కంప్యూటర్‌లలో సాక్ష్యాలను చొప్పించడానికి మాల్‌వేర్‌ను ఉపయోగించడంలో నిపుణులైనవారిని హ్యాకర్‌గా ఉపయోగించారని కంప్యూటర్‌ల హ్యాకింగ్‌పై అమెరికా కేంద్ర నిపుణుల అన్వేషణలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన రెండు డిజిటల్‌ ఫోరెన్సిక్స్, సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలైన ఆర్సెనల్‌ కన్సల్టింగ్, సెంటినెల్‌ ల్యాబ్స్‌ కనుగొన్న వాటిని అంగీకరించడానికి ఎన్‌ఐఏ, పుణె పోలీసులు నిరాకరించారు. విచారణ సమయంలో ఈ నిపుణుల ఫలితాలను సమర్పించడానికి డిఫెన్స్‌ లాయర్లు ప్రయత్నించవచ్చు.

విచారణ ఎప్పుడు మొదలవుతుంది? ఇప్పటికైతే అభియోగాలు కూడా మోపే సూచనలు కనిపించడం లేదు. ప్రత్యేకించి తమపై మోపిన నేరాలకు సంబంధించి తాము దోషులం కాదని వారు చెబుతున్నప్పుడు కూడా విచారణపై ఆశ లేకుండా ఏళ్ల తరబడి వారిని జైలులో ఉంచడం ఏ ప్రజాస్వామిక దేశంలో అయినా జరిగిందా? 

జూలియో రెబీరో  
వ్యాసకర్త మాజీ ఐపీఎస్‌ అధికారి; ‘పద్మభూషణ్‌’ పురస్కార గ్రహీత (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement