సుడిగుండంలో ‘మహా’ సర్కారు

Param Bir Singh's Extortion Charge On Anil Deshmukh: Maharashtra Home Minister Denies Allegations - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపాన బాంబులతో దొరికిన కారు అనేకానేక మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. మొదట్లో ఉగ్రవాదుల పనిగా అందరూ అనుమానించిన ఉదంతం కాస్తా ముంబై పోలీసుల మెడకు చుట్టుకోవటమే వింత అయితే...అది మళ్లీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వైపు మళ్లి, శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. తాజాగా అది సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ ఎపిసోడ్‌లో నగర పోలీస్‌ కమిషనర్‌ పదవి కోల్పోయిన పరంవీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేకు లేఖ రాయటమేకాక, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. తన బదిలీ చెల్లదని ప్రకటించాలని కూడా కోరారు. పోలీసు వ్యవస్థను అధికారంలో వున్నవారు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలు చాలా పాతవి.

ప్రత్యేకించి ముంబై పోలీసులకు ఆ విషయంలో మొదటినుంచీ అంత మంచి పేరు లేదు. ఒకప్పుడు ఆ మహానగరాన్ని మాఫియా డాన్‌లు తమ అడ్డాగా మార్చుకుని వ్యాపారులనూ, పారిశ్రామికవేత్తలనూ, సినీ నటుల్ని బెదిరించి డబ్బు దండుకోవటం, యధేచ్ఛగా కిడ్నాప్‌లకు పాల్పడటం, దాడులు చేయటం సాగిస్తున్నప్పుడు ముంబై పోలీసులు వాటిని సరిగా అరికట్టలేకపోయారు. వారిలో కొందరు మాఫియాలతో కుమ్మక్కు కావటమే అందుకు కారణమన్న ఆరోపణలుండేవి. ఆ వంకన బూటకపు ఎన్‌కౌంటర్లు జోరందుకున్నాయి. అమాయకుల్ని సైతం ఆ ముసుగులో హతమారుస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. 2008 నవంబర్‌ 26న ముంబైపై ఉగ్రవాదులు చేసిన దాడి, అంతక్రితం జరిగిన బాంబు పేలుళ్లు ముంబై పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేశాయి. ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కోల్పోయిన 173మందిలో పోలీసు ఉన్నతాధికారులు హేమంత్‌ కర్కరే, అశోక్‌ కామ్టే, ఇతర సిబ్బంది కూడా వున్నారు. కానీ పటిష్టమైన ముందస్తు నిఘా వుంచటంలో ముంబై పోలీసుల వైఫల్యం క్షమార్హం కాదు. ఇదంతా తెలిసి కూడా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, వివాదరహితంగా తీర్చిదిద్దటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.

మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా వున్న అధికారి సచిన్‌ వాజేను హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సర్వీసులోకి తీసుకోవటమేకాక, ఆయనకు కీలకమైన కేసుల దర్యాప్తు బాధ్యతను అప్పగించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా అపకీర్తి గడించిన వాజే, ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. మధ్యలో శివసేనలో చేరాడు. అలాంటి వ్యక్తికి హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా పదవి కట్టబెట్టటంలోని ఔచిత్యమేమిటి? ఇందుకు కారణం పరంవీర్‌ సింగేనని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ అంటున్నారు. మరి రాజకీయ నాయకత్వం వుండి ఏం చేసినట్టు? అనిల్‌ దేశ్‌ముఖ్‌ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారు? తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేంద్రం ఈ తతంగాన్నంతా నడిపిస్తోందంటున్న పవార్‌ దీనికేం చెబుతారు? ప్రభుత్వాలు నిర్వర్తించే కర్తవ్యాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైనది. సురక్షితంగా, భద్రంగా వున్నామన్న భావన పౌరులకు కలగాలంటే పటిష్టమైన, చురుకైన పోలీసు వ్యవస్థ వుండాలి. అదే సమయంలో అది కర్తవ్య నిష్టతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. కానీ మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రభుత్వానికి దానిపై అదుపాజ్ఞలు వున్న దాఖలా కనబడదు.

పోలీస్‌ కమిషనర్‌ పదవినుంచి తనను తప్పించగానే పరంవీర్‌ సింగ్‌ తీవ్రమైన ఆరోపణలే చేశారు. నెలకు వంద కోట్లు వసూలు చేసి ఇవ్వాలని వాజేకు అనిల్‌ దేశ్‌ముఖ్‌  నిర్దేశించారని ఆయనంటున్నారు. మరి అలాంటి వ్యక్తికి కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను పరంవీర్‌ ఎలా అప్పగించారు? కనీసం తన బదిలీకి ముందు ఈ ఆరోపణ చేసివుంటే ఆయన నిజాయితీ వెల్లడయ్యేది. పదవినుంచి తప్పించారన్న అక్కసుతోనే ఇలా అంటున్నారన్న అభిప్రాయం అందరిలో ఏర్పడే పరిస్థితి వుండేది కాదు. తాను చాన్నాళ్లక్రితమే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దృష్టికి ఈ సంగతి తీసుకొచ్చానని పరంవీర్‌ అంటున్నారు. అదే జరిగుంటే పరంవీర్‌ను ఇన్నాళ్లు పదవిలో కొనసాగించేవారా అన్న సంశయం కలుగుతుంది.  వాజే వ్యవహారంలో తన ప్రమేయాన్ని తుడిచేసుకోవటానికే పరంవీర్‌ ఇలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. 

హోంమంత్రి, పోలీసు విభాగం ఇలా ఆరోపణల్లో చిక్కుకోవటం మహారాష్ట్రలో ఇది మొదటిసారేమీ కాదు. 2003లో అప్పటి హోంమంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌పై అవినీతి ఆరోపణలు రావటంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన అబ్దుల్‌ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో కూడా ఇరుక్కున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టులుగా పేరుమోసి, అమాయకుల్ని హతమార్చారన్న ఆరోపణలున్నవారిని నెత్తినపెట్టుకోవటం వాజేతోనే మొదలుకాలేదు. నకిలీ ఎన్‌కౌంటర్ల కేసులో శిక్షపడిన 11మంది పోలీసులను 2015లో విడుదల చేసిన ఘనత అప్పటి బీజేపీ–శివసేన సర్కారుది. దీన్ని బొంబాయి హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి అడ్డుకుంది. తాజా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న సంగతలా వుంచితే ఆరోపణలొచ్చిన విలాస్‌ దేశ్‌ముఖ్‌తో రాజీనామా చేయించటం, వాజే పునరాగమనంలో నిజంగా పరంవీర్‌ పాత్ర వుంటే నిగ్గు తేల్చి, తగిన చర్యలు తీసుకోవటం రాజకీయంగా మహారాష్ట్ర ప్రభుత్వానికే మంచిది.   

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top