ఒంటరిగా టీడీపీ పోటీ చేయలేదా?

Kommineni Srinivasa Rao Article On Why Everytime Tdp Contest With Alliance - Sakshi

విశ్లేషణ

ఎవరిపైన అయినా బురద జల్లడంలో చంద్రబాబును మించినవారు లేరు. దేశం యావత్తూ ఉక్రెయిన్‌ యుద్ధం గురించీ, అక్కడ చిక్కుకున్న విద్యార్థుల గురించీ ఆందోళన చెందుతుంటే– చంద్రబాబు మాత్రం ఒక సినిమా గురించి కలవరపడుతున్నారు. పైగా దానికి జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపిస్తున్నారు. అంత ఖాళీగా ఆయన, టీడీపీ పార్టీవాళ్లు మాత్రమే ఉన్నారు. సినిమా నటుల రాజకీయాలకు రోజులు చెల్లిపోయాయని ఒకప్పుడు చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ను తమవైపు తిప్పుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. దీనిద్వారా తెలుగుదేశం పార్టీ చాలా బలహీనపడిందని చెప్పకనే చెబుతున్నారు. ఎంతో వైభవంగా కొనసాగిన టీడీపీ నలభై ఏళ్ల తర్వాత ఇలా పతనం అవుతుందని ఎవరూ ఊహించలేదు. 

ఏపీ ప్రతిపక్ష నేత చంద్ర బాబును ఒకందుకు అభి నందించాలి. ఎలాంటి ఆరోపణను అయినా అందులో వాస్తవాలతో నిమిత్తం లేకుండా చేసేయగలరు. ఎవరిపైన అయినా బురద జల్లడంలో ఆయనను మించిన నిపుణుడు దేశంలోనే మరొకరు ఉండకపోవచ్చు. ఎలా పడితే అలా మాట్లాడటా నికి ఏ ఇతర నేతలైనా సహజంగానే బిడియ పడతారు. ఆయన కొద్ది రోజుల క్రితం చేసిన ఒక ఆరోపణ చూడండి. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉక్రెయిన్‌లో చిక్కు కున్న వాళ్ల విద్యార్థులు, పౌరులను భారత్‌కు రప్పించడానికి ప్రయత్నిస్తుంటే ఏపీ ముఖ్య మంత్రి జగన్‌ మాత్రం భీమ్లానాయక్‌ సిని మాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారట. ఇక్కడ విశేషం ఏమిటంటే, దేశం అంతటా ఉక్రేనియన్‌ యుద్ధం గురించి ఆందోళన చెందుతుంటే... చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు గానీ ఈ సినిమా వ్యవహారాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం. 

చంద్రబాబు కుమారుడు అయితే ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని ప్రకటించారు. అంటే ఎవరు దేనిపై ఆసక్తి కనబరు స్తున్నట్టు? మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌ సంబంధిత అధికారులతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను ఎలా రప్పించాలి, వారికి ఇబ్బందిలేకుండా ఎలా చూడాలి అన్న అంశంపై చర్చిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాయడం, ఆయనతో ఫోన్లో మాట్లాడటం చేశారు. అయినా చంద్రబాబు ఈ ఆరోపణ చేయడానికి వెనుకాడలేదు. సోషల్‌ మీడియాలో చంద్రబాబుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులకు అభి నందనలు, శుభాకాంక్షలు చెప్పారట. మనవాళ్లు ఉక్రెయిన్‌ సరిహద్దులలో నానాపాట్లు పడుతుంటే చంద్రబాబు అభినందనలు చెప్పడం ఏమిటా అని టీడీపీ నేతలు తలపట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. వయసు మీద పడుతుండటం వల్ల పరధ్యానంగా ఇలా తప్పులు మాట్లాడుతున్నారేమో అన్న సంశయం కలుగుతుంది. 

భీమ్లానాయక్‌ సినిమాకు ఇచ్చిన ప్రాధాన్యతను చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ నేతలు, టీడీపీ మీడియా మరే సినిమాకూ ఇవ్వలేదన్నది బహిరంగ రహస్యమే. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను మచ్చిక చేసుకుని తమ గూటిలో వేసుకోవడమే వారి లక్ష్యం అని వేరే చెప్పనవసరం లేదు. ఎన్నికల నాటికి వన్‌ సైడ్‌ లవ్‌ను టూ సైడ్‌ లవ్‌గా చేయడానికి చంద్రబాబు విశ్వ యత్నం చేస్తున్నారని చెబుతున్నారు. నిజంగానే సినిమా రంగంపై అంత శ్రద్ధ ఉన్నట్లయితే చంద్రబాబు తాను ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా జనతా గ్యారేజీకి బెనిఫిట్‌ షో అవకాశం లేదంటూ ఉత్తర్వులు ఎలా ఇచ్చారని కొందరు గుర్తుచేస్తూ సంబంధిత వార్తల క్లిప్పింగులను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘మెగాస్టార్‌’ చిరంజీవి ఖైదీ నంబర్‌ 150 సినిమా ప్రీరిలీజ్‌ ఉత్సవానికి విజయవాడలో అనుమతి ఇవ్వకపోతే ఆయన హాయ్‌ లాండ్‌లో ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. రాత్రి తొమ్మిది గంటలు అవ్వగానే కార్యక్రమాన్ని ముగించాలని పోలీసులు ఒత్తిడి చేశారట. కుమారుడికి పోటీ రాకుండా ఉండటం కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కే శారని టీడీపీ నేతలే చెబుతుంటారు. తన వియ్యంకుడు బాల కృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి పన్ను రాయితీలు ఇచ్చారు. కానీ గుణశేఖర్‌ తీసిన రుద్రమదేవికి ఇవ్వ డానికి నిరాకరించారు.  

సినిమాల పట్ల వివక్ష చూపిన చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌ చేసిన తప్పేమిటి? అన్ని సినిమాలను సమానంగా చూడాలని ఉత్తర్వులు ఇవ్వడం! బ్లాక్‌ మార్కెట్‌లో టికెట్లు అమ్మకుండా, థియేటర్లలో సదుపాయాలు సక్ర మంగా ఉండేలా చర్యలు తీసుకోవడం. ఇవన్నీ తప్పు అని చంద్ర బాబు గానీ, ప్రకాష్‌ రాజ్‌ వంటి నటులు గానీ చెబుతున్నారంటే వారు సామాన్య ప్రజలపట్ల ఎంత సానుకూలంగా ఉన్నది అర్థం చేసు కోవచ్చు. పోనీ ఈ ఒక్క సినిమాకే ఇలా నిబంధనలు పెట్టారా అంటే అదేమీ లేదు. అఖండ, పుష్ప, బంగార్రాజు తదితర సినిమాలకు కూడా ఇదే రూల్‌ వర్తింపజేసినా ఎవరూ ఆక్షేపించలేదు. పైగా అవన్నీ బాగా ఆడాయి. పవన్‌ నటించిన సినిమా గురించి టీడీపీ గానీ, టీడీపీ మీడియా గానీ ఎందుకు అంత ప్రచారం చేశారంటే, చంద్రబాబును గెలిపించడానికి అవకాశం ఉంటే పవన్‌ ఆ పనిచేయాలని వారి ఉద్దేశం. 

జగన్‌ వద్ద చిరంజీవికి విశేష గౌరవం లభిస్తే చంద్రబాబు, పవన్‌ వంటివారు ఓర్చుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించదు. చిరంజీవే కాదు, మహేష్‌ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్‌.నారాయణమూర్తి వంటి ప్రముఖులు కూడా జగన్‌కు థాంక్స్‌ చెప్పారు. అయితే సంబం ధిత జీఓ రావడంలో కొంత ఆలస్యం అవుతోంది. దానికి కారణాలను కూడా మంత్రి పేర్ని నాని వివరించారు. భీమ్లానాయక్‌ ఫలవంతమైన సినిమా అయితే ప్రజలు చూడకుండా ఉంటారా? ఏదేమైనా ఒక సినిమా కోసం చంద్రబాబు ఇంతగా తాపత్రయపడిన ఘట్టం ఇదే. 

ప్రస్తుతం పవన్‌ బీజేపీతో దోస్తానాలో ఉన్నారు గానీ, అవకాశం వస్తే టీడీపీ వైపు దూకుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయట. ఒకటి, బీజేపీని వదలి టీడీపీ వైపు వెళితే ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న ఆందోళన. రెండు, పవన్‌ కళ్యా ణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనీ, ఒక వేళ గెలిస్తే టీడీపీ, జనసేన చెరిసగం పదవీ కాలాన్ని పంచుకోవాలని జనసేన నేతలు కొందరు షరతు పెడుతున్నారట. మూడోది మరొకటి ఉంది. జనసేనకు 75 సీట్లయినా కేటాయించాలని అంటున్నారని ప్రచారం జరుగుతోంది. బేరసారాలలో అది యాభై అయినా చాలా ఎక్కువని టీడీపీ సహజం గానే భావిస్తుంది. బీజేపీ ఇప్పటికే పవన్‌ను తమ సీఎం అభ్యర్థి అనడం టీడీపీకి తలనొప్పిగా మారింది. తాము కూడా పవన్‌కు సీఎం అవకాశం ఇస్తామని చెప్పకపోతే జనసేన కలుస్తుందో, లేదో అన్న సంశయం టీడీపీ వారికి ఏర్పడిందని అంటున్నారు. 

చంద్రబాబుకు ఇంకో సమస్య వస్తోందట. పవన్‌కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా టీడీపీ బాగా బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పినట్లవుతోందని కొందరు గగ్గోలు పెడుతు న్నారట. పవన్‌కు సీఎం పదవి ఆఫర్‌ ఓకే చేస్తే, లోకేష్‌ సంగతేమిటని ఆయన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారట. అయినా ఇప్పుడున్న పరిస్థితిలో జగన్‌ పార్టీని ఓడించడం అంత తేలికకాదని భావిస్తున్న టీడీపీ అధిష్టానం పవన్‌ను ఆకర్షించే పనిలో పడిందన్నది రాజకీయ నిపుణుల భావన. అందుకే చివరికి పవన్‌ సినిమా గురించి ప్రచారం చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత చంద్రబాబు కొంతకాలం ఆయనపై విమర్శలు కురిపించేవారు. సినిమా నటుల రాజకీయాలకు రోజులు చెల్లిపోయాయని అనేవారు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఎన్టీఆర్‌ మరణించడంతో వెంటనే రంగంలోకి దూకి ఆయన వారసులం తామేనని చంద్రబాబు ప్రకటించుకోవడంలో సఫలం అయ్యారు. ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడితే, తాను ఆత్మవిశ్వాసం ఇచ్చానని ప్రచారం చేసుకునేవారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని వదలుకుని, ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యవహరించడం బాధాకరమే. ఎవరో ఒకరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అసాధ్యమని తెలుగుదేశం భావిస్తోంది. ఉన్నత విలువలు, ఆశయాలతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల తర్వాత ఇలా పతనం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అదే రాజకీయ వైచిత్రి!

 వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top