జడలు విప్పుతున్న వికృత హింస.. చుట్టూ పరిస్థితులు మారాలి

Kadiyam Kavya Write on How to Protect Kids From Abuse, Awareness of Society - Sakshi

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో ముక్కు పచ్చ లారని చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. దీనిని చూస్తుంటే ఆడ పిల్లలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా లైంగిక దాడికి గురయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. జడలు విప్పుతున్న ఈ వికృత అమానవీయ హింస ఆడ పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లైంగిక దాడులకు ప్రేరేపించే సంస్కృతి మన చుట్టూ విశృంఖల స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... లైంగిక దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

రక్త సంబంధీకులు, టీచర్లు, డ్రైవర్లు... ఇలా మన చుట్టుపక్కల ఉండే మనకు పరిచయం ఉన్నవారూ, లేనివారి రూపాల్లో లైంగికదాడులు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో పలుకుబడి ఉన్న నిందితులు బెదిరించడం వల్ల చాలామంది బాధిత కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ భయపడుతున్నారు. 

అలాగే లైంగిక దాడి సంగతి  బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు సహజంగానే ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పు కోలేక తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అటువంటి కుటుంబాలపై దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. అందుకే బాధిత కుటుంబాలు వెంటనే పోలీస్‌ సహాయం పొందాలి.

చిన్నపిల్లల విషయంలో ఆడ, మగ అన్న తేడాను చూపించకుండా ఇద్దరిపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రూరులు మరో అడుగు ముందుకువేసి చైల్డ్‌ సెక్స్, చైల్డ్‌ పోర్నోగ్రఫీల రూపంలో ఈ భయంకర సంస్కృతిని ఇంటర్నెట్‌లో పెట్టి డబ్బు చేసుకునే పనీ చేస్తున్నారు. అంటే వీళ్లు ఈ అసాంఘిక, అమానవీయ కార్యకలాపాలను ‘మార్కెట్‌ సరుకు’గా మార్చేశారన్న మాట. 

‘వర్జిన్‌ సెక్స్‌’ పేరుతో టీనేజ్‌ పిల్లలపై లైంగికదాడులు చేస్తూ అంతర్జాలంలో ఆ వీడియోలు వైరల్‌ చేసి డబ్బులు సంపాదించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ దాడులకు గురైన పిల్లలు క్రమంగా సెక్స్‌ వ్యాపారం ఊబిలో కూరుకుపోయి జీవితాలను కోల్పోతున్నారు. ఆధునిక యాంత్రిక ప్రపంచంలో తల్లిద్రండులు పిల్లలకు పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల నేరస్థులు పిల్లలను ట్రాప్‌ చేయగలుగుతున్నారు. అలాగే పిల్లలకు సెల్‌ఫోన్‌ అందుబాటులో ఉండటం వల్ల అన్నీ చూసే అవకాశం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వారు దారితప్పుతున్నారు. టీవీల్లో ప్రసారం అవుతున్న కంటెంట్‌ కూడా ఈ దురాగతాలకు కారణమవుతున్నది. 

ఈ పరిస్థితి మారాలంటే పాఠశాల స్థాయిలోనే మోరల్‌ సైన్స్‌ క్లాస్‌లను తప్పని సరిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్‌ టచ్, గుడ్‌ టచ్‌ల గురించిన అవగాహన పిల్లలకు కల్పించాలి. పిల్లలపై లైంగిక దాడుల నియంత్రణ, వాటిని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘పోక్సో’ తరహా చట్టాల పట్ల అవగాహన కూడా సమాజాన్ని అప్రమత్తం చేయటంలో ఉపకరిస్తాయి. (క్లిక్ చేయండి: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్‌ భరోసా)


- డా. కడియం కావ్య 
కడియం ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top