ప్రేమ జంటలను ఇలా కాపాడుకోవచ్చు...

H Wagison Article On Love Marriage Problems - Sakshi

అభిప్రాయం

కులం, మతం, తెగ అనే వివిధ సముదాయాల లోపలే పెళ్లిళ్ళు  జరగాలి అని కోరుకునే సంస్కృతి బలంగా ఉన్న దేశం మనది. సముదాయానికి బయట ఉండే మనుషుల పట్ల ఇష్టాలు, ప్రేమలు అనేకం వివాహం వరకు పోకపోవడానికి ఈ సంస్కృతే కారణం. అదేమీ గొప్ప సాంస్కృతిక విలువ కాదు. సము దాయం లోపలి పెండ్లి అన్ని తీరులా గొప్పదీ, సముదాయం బయట పెండ్లి అనేక తీరుల్లో మంచిది కాదూ అనేది తప్పుడు ఆలోచన. ఒకటి మాత్రం వాస్తవం. ఇటువంటి వివాహాలను మెచ్చుకుని ఒప్పుకునే వాతావరణం మన దగ్గర పెరగలేదు. అందునా విలోమ వివాహాల పట్ల మరింత వ్యతిరేకత ఉన్నది. ఈ తరహా వివాహాలు మనుగడ సాగించాలంటే కొన్ని ప్రధాన కార్యక్రమాలు వివిధ స్థాయిల్లో జరగాలి.
చదవండి: సర్కారీ కొలువుల జాతర

సముదాయాంతర వివాహాలను కాపాడుకోవడంలో ముందుగా వివాహం చేసుకున్న జంటకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారు ఆ బాధ్యతను నెరవేర్చుకునే దానికి సహ కారం, సలహాలు, మద్దతును కూడగట్టుకోవాలి. సామాజిక కట్టుబాట్ల సరిహద్దు దాటిన జంటలు  తొలి మూడు నాలుగు ఏండ్లు చాలా జాగ్రత్తగా, మెలకువగా మసలుకోవాలి. సామా జిక కట్టుబాట్లను ఉల్లంఘించి ఏర్పడిన జంట, హింసకు గురి కాగల, ఒక ప్రమాదాన్ని ఎదుర్కొనే అల్ప సంఖ్యాక జంటగా  మారుతుంది.

ఎందుకంటే చాలా సందర్భాలలో ఈ జంట మీద  సామజిక కట్టుబాట్ల పరిరక్షకులుగా ఉండే హింసాత్మక మెజారిటీ వర్గంవారు వివిధ రూపాలలో దాడి చేసే అవకాశం ఉంటుంది. ముందుగా వారు వేరే ఎవ్వరి మీద ఆధారపడకుండా మెరుగుగా, తమ సంసారాన్ని గడిపే దానికి  కావలిసిన రోజువారీ సామర్థ్యాల మీద  దృష్టి పెట్టాలి. రెండు మూడు ఏండ్ల వరకు ఇటువంటి జంటలు పిల్లలను కనకుండా జాగ్రత్త పడాలి.

వివాహంలో సామాజిక అంశాలు ఉంటాయి, కానీ వివాహం ముఖ్యంగా జంట వ్యక్తిగత వ్యవహారమనేది మరిచిపోకూడదు. ఆడపిల్లను ఆస్తిగా, గౌరవంగా, కుల మత, తెగ పవిత్రతను, పరిశుద్ధతను రక్షించే క్షేత్రంగా చూసే దృష్టి ప్రతి సముదాయంలో  బలంగా ఉంది కనుక... సము దాయ కట్టుబాట్లు దాటిన వివాహాలలో జంటలకు ఆడ వారి బంధువుల నుండి ప్రమాదం అతి ఎక్కువగా ఉంటున్నది. ఈ వాస్తవాన్ని జంటలు గమనంలో ఉంచుకోవాలి.

సముదాయాంతర వివాహాల పట్ల సానుకూలంగా ఉండే వారు,  తాము నివాసం ఉంటున్న చోట తమవంటి వారితో కలుస్తూ ఉండాలి. ఒక భావ సారూప్య బృందంగా లేక కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌గా రూపొందాలి. ప్రతి చిన్న ప్రాంతంలో ఇటువంటి వివాహాల మద్దతు బృందాలు ఏర్ప డాలి. తమ ఎరుకలో ఉండే అటువంటి జంటలకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఇలాంటి బృందాలు ఉన్నాయన్న విషయం బాగా ప్రచారం కావాలి. సముదాయాంతర జంట లకు సహకరించే నెట్‌వర్క్‌ ఉంది అని నమ్మకాన్ని ఇవ్వడం ముఖ్యం. అట్లనే  అటువంటి జంటలు ఎదుర్కొనే ఎమో షనల్‌ సమస్యలను తట్టుకునేదానికి సలహాలు ఇచ్చే ఏర్పాటుగా ఈ సామాజికుల బృందం ఉండాలి.

వామపక్ష ఉద్యమాలు తరచుగా సముదాయం బయటి వివాహాలను ప్రోత్సహించినాయి. ఇప్పుడు బాగా ప్రాచు ర్యంలో సాగుతున్న గుర్తింపు ఆధారిత ఉద్యమాలు–  అందునా పీడిత  సముదాయాల సామూహిక శక్తిని పెంపు చేసే దానికి నడుస్తున్న  ‘గుర్తింపు– సయోధ్య’ (ఐడెంటిటీ– అలయన్స్‌) అనే సూత్రం పునాదిగా సామాజిక క్షేత్రంలో ఉద్యమాలు చేస్తున్నవారు సముదాయాంతర వివాహాల వైపు తమ తమ అనుయాయులకు  అవగాహన కలిగించాలి.

తమ సొంత సముదాయాలు దాటి పెళ్లి చేసుకోవడాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయన్న నమ్మకం ప్రజల్లో కలిగిం  చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి వావాహాలను ప్రోత్సహిస్తూ... కొన్ని ప్రోత్సాహ కాలు ఇస్తున్నప్పటికీ అవి చాలవు. ఈ వివాహాల పరిరక్షణకు అవసరమైన చట్ట పర, పాలనాపర, విధానపర ఏర్పాట్లు ఉండాలి. ఇప్పటికే ఉన్న ఇటువంటి వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణనిచ్చే చట్టాల గురించీ, వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ పథకాల గురించీ విస్తృత ప్రచారం కల్పించాలి. ఈ జంటలు తమకు మతం లేదు కులం లేదు అని ప్రకటించు కోదలిస్తే... అటు వంటి పత్రాలు ఇచ్చే ఏర్పాటు ఉండాలి. ప్రమాదంలో ఉన్న జంటలకు రక్షణ కల్పించడానికి పోలీ సులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

ప్రసార మధ్యమాలలో పనిచేసే వారికి సముదాయం బయట జరిగే వివాహాల ప్రాధాన్యత, అవి ఎదుర్కునే సమస్యల గురించిన అవగాహన ఉండాలి. సముదాయం బయట జరిగిన పెళ్లి... హత్యలకో, మరో రకం హింసలకో దారి తీసినప్పుడు మాత్రమే అది వార్త అనుకునే దుఃస్థితి ఈ రోజు ప్రసార మాధ్యమాలలో ఉంది. ప్రసార మాధ్యమా లలో పనిచేసే వారికి, సముదాయం దాటి చేసుకునే వివా హాలకు సానుకూలంగా ఉండే నిరంతర అవగాహన కార్య క్రమాలు ఉండాలి.

ఇలాంటి వివాహాలు చేసుకుని విజయవంతంగా జీవితం గడుపుతున్న  వివాహితుల గురించిన  శీర్షికలు, పరి చయ కార్యక్రమాలు విరివిగా పత్రికలు, టీవీల్లో రావాలి. వాస్తవానికి సముదాయానికి బయట వివాహం చేసు కోవడం ప్రతి సందర్భంలోనూ హింసతో ముగిసిపోవడం లేదు. అటువంటి చాలా వివాహాలు విజయవంతంగా సాగుతూ ఉంటాయి. ఈ అంశానికి తగిన ప్రచారం ప్రసార మాధ్యమాలు ఇవ్వాలి.

కుల, మత, జాతి భేదాలు చూడకుండా నచ్చినవారిని వివాహం చేసుకునే వివాహాలు నాలుగు కాలాల పాటు మనుగడ సాగించాలంటే.. జంటల వ్యక్తిగత స్థాయిలోనే కాక, పౌర సమాజం, ప్రభుత్వ స్థాయిల్లో అప్రమత్తత. మద్దతు, రక్షణ ఉండాలి. సమాచార ప్రచార మాధ్యమాల తోడ్పాటూ ఎప్పటికప్పుడు అందాలి.


హెచ్‌. వాగీశన్‌
వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్, నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top