సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం | Sakshi
Sakshi News home page

సంక్షోభాన్ని పెంచిన ఆ అంతర్యుద్ధం

Published Sat, Sep 30 2023 3:08 AM

Civil War Escalated The Crisis In Manipur - Sakshi

జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంపై భారత్‌లో వెల్లువెత్తిన ఉత్సాహం... సంఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌ను వ్యూహాత్మకంగా విస్మరించడానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిష్క్రియాత్మకత వల్లే ఈశాన్య ప్రాంతంలో ఇంత పతనం సంభవించింది. మయన్మార్‌లో 28 నెలల నాటి అంతర్యుద్ధం పాక్షికంగా మణిపుర్‌ మంటలను పెంచి పోషించింది. ఫలితంగా 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4,000 ఆయుధాల చోరీ జరిగింది. మయన్మార్‌ నుండి వచ్చిన శరణార్థుల వెల్లువతో పాటు, కుకీలు లేని ఇంఫాల్‌ లోయ, మైతేయిలు లేని కుకీ–నివాస కొండ ప్రాంతాలు అనే జాతి ప్రక్షాళన మణిపుర్‌ను నిలువునా విభజించింది. 

కుకీలు, మైతేయిల జాతి ప్రక్షాళన ధోరణి మణిపుర్‌ను నిట్టనిలువున చీల్చింది. తీవ్రమైన ఈ విభజనే, విద్రోహం(ఇన్‌సర్జెన్సీ) మళ్లీ చెలరేగుతుందన్న భయా లను రేకెత్తించింది. రాష్ట్ర ఆయుధాగారాల నుండి కొల్లగొట్టిన ఆయు ధాలు అందుబాటులో ఉండటమే ఈ భయాలకు కారణం. గత నెలలో అస్సాం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పిసి నాయర్‌ ఇలా చెప్పారు: ‘‘పరిస్థితి అసాధారణంగా ఉంది. మేము ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.’’ ఇంఫాల్‌లోని నాలుగు జిల్లాల్లో గల 39 పోలీస్‌ స్టేషన్లలోని 16 స్టేషన్లలో సాధారణ స్థితి ఏర్పడినట్లు చూపడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మార్చి 25న ఉపసంహరించుకున్న తర్వాత పరి స్థితి ఇలా ఉంది. ఈ చర్యను మళ్లీ వెనక్కి తీసుకోలేదు.

‘‘విద్రోహాన్ని గణనీయంగా తగ్గించేశాం. దాదాపుగా లేదు’’ అని మాజీ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎం.ఎం. నరవణే చెప్పారు. ఈ పరిస్థితి ఉత్తరం వైపు సైన్యాన్ని తిరిగి సమతుల్యం చేయడానికి, అలాగే ఈశాన్య ప్రాంతంలో సైనిక చర్యల బాధ్యతను అస్సాం రైఫిల్స్‌కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ ఆచర ణకు భిన్నం. ఒక్క 1965, 1971 యుద్ధాల సమయంలో మాత్రమే ఇలా చేశారు.

మయన్మార్‌లో మిలిటరీ జుంటాకూ, దానిని వ్యతిరేకిస్తున్న శక్తుల (నేషనల్‌ యూనిటీ గవర్నమెంట్‌–ఎన్‌యూజీ, ఇంకా ప్రతిఘటన)కూ మధ్య అంతర్యుద్ధం దాని మూడవ సంవత్సరంలోకి ప్రవేశించింది. నాగాలాండ్, మిజోరాం, మణిపుర్‌లకు సమీపంలోని సగాయింగ్‌ ప్రాంతం, చిన్‌ రాష్ట్రం ప్రధాన పోరాట వేదికలుగా ఉంటున్నాయి. సైనిక జుంటా ఈ ప్రాంతంలో అధికారం కోల్పోయినందున, అది నాపాం బాంబులను ప్రయోగించడం, గ్రామాలను దోచుకోవడం, తగలబెట్టడంతోపాటు వైమానిక బాంబులను ఆశ్రయిస్తోంది. పర్య వసానంగా, దాదాపు 60,000 మంది చిన్, కుకి, జోమి శరణార్థులు మిజోరం, మణిçపుర్‌లకు  పారిపోయారు. వీరిలో కొందరు ఎన్‌యూ జీకి చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మయన్మార్‌తో 1,600 కి.మీ. పొడవైన అంతగా గస్తీ ఉండని సరిహద్దుతోపాటు, ఇరువైపులా 16 కి.మీ. మేర స్వేచ్ఛా కదలికలకు అనుమతిస్తున్న పాలన కారణంగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, బంగారం, విలువైన రాళ్లు మణిపూర్‌ లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి.

‘గోల్డెన్‌ ట్రయాంగిల్‌’ గుర్తుందిగా? మాదకద్రవ్యాల అక్రమ రవాణా మణిపుర్‌కు కొత్తేమీ కాదు. భద్రతా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 ఫిబ్ర వరిలో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్‌తో దొరికిన సైనిక కల్నల్‌ను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌ 15న ‘గోవా క్రానికల్‌’లో ప్రచురితమైన కథనంలో, మణిపుర్‌లోని జఠిలమైన మాదకద్రవ్యాల వ్యాపార నెట్‌వర్క్‌ వివరా లను ఇచ్చారు. 2021 నుంచి మణిపుర్‌లో గసగసాల సాగు 33 శాతం పెరిగిందని ఐరాస నివేదిక పేర్కొంది. ఇది కుకీలకు నగదు పండించే పంట అని మైతేయిలు ఆరోపిస్తున్నారు. కానీ గోవా క్రానికల్‌ కథనం ప్రకారం, ముస్లిం పంగల్లతో సహా ప్రతి సమాజానికీ ఈ పంటలో వాటా ఉంది.

భారతదేశ ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ని మయన్మార్‌ వివాదం తీవ్రంగా దెబ్బతీసింది. ఇది ఆసియాన్‌ (ఆగ్నేయాసియా దేశాల సంఘం)తో వాణిజ్యం, పరస్పర చర్యలను ముందుకు తీసుకెళ్లేందుకు రూపొందించిన విధానం. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ సెప్టెంబర్‌ ప్రారంభంలో మీడియాతో మాట్లాడుతూ, ‘‘భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక మైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆగ్నేయాసియాతో ఉన్నాయి. మయన్మార్‌ అంతర్గత భద్రతా వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిన కారణంగా అవి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి,’’ అని చెప్పారు. మిజోరం మార్గంలో తిరుగుబాటు సోకిన రాఖైన్‌ రాష్ట్రం గుండా వెళుతున్న దాదాపు రెండు దశాబ్దాల నాటి మల్టీమోడల్‌ కలాదాన్‌ ప్రాజెక్టును అరాకాన్‌ సైన్యం (మయన్మార్‌) కాలానుగుణంగా నిరోధిస్తూ వచ్చింది.

మణిపుర్‌లోని మోరేతో థాయ్‌లాండ్‌లోని మయీ సాట్‌తో కలిపే భారతదేశం, మయన్మార్, థాయ్‌లాండ్‌ త్రైపాక్షిక హైవే ప్రాజెక్టును సగాయింగ్‌(మయన్మార్‌) ప్రాంతంలో జరిగిన పోరాటాల కారణంగా నిలిపివేశారు. ఈ నెలలోనే జరిగిన ఆసియాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్‌ మయన్మార్‌ విదేశాంగ మంత్రి థాన్‌ స్వేతో సమావేశమయ్యారు. భారతదేశం, మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలో జరిగిన పోరాటాలు, వైమానిక దాడులు కలిగిస్తున్న ప్రమాదకరమైన ప్రభావాల గురించి థాన్‌ స్వేకి వివరించారు.

‘ఎన్‌యూజీ’కి చెందిన పీపుల్స్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (పీడీఎఫ్‌) సగాయింగ్‌ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తోంది. అంతర్యుద్ధ  ప్రతి ష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ‘అన్ని ఫలాలను జుంటా బుట్టలో’ ఉంచే విధానాన్ని ఢిల్లీ సమీక్షించుకోవాలి. దేశ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి చిన్‌ నేషనల్‌ ఫ్రంట్, అరకాన్‌ సైన్యాన్ని భారత ఏజెన్సీలు సిద్ధం చేయాలి. ప్రజాస్వామ్య శక్తులతో సంబంధాలను పునరుద్ధరించడం, ఆయుధాల సరఫరాతో సహా ఎన్‌యూజీ/పీడీఎఫ్‌తో సమాచార మార్గాలను ఏర్పాటు చేయడం ఆచరణీయమైన ఎంపికలు.
ఇది సమస్యను నిరోధించవలసిన చర్యను ఆలస్యంగా చేపట్టడం లాంటిదే అయినప్పటికీ, భారతదేశ యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి కీలకంగా ఉన్న మణిపుర్‌ సమస్యకు తక్షణ చికిత్స అవసరం. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపుర్‌ను రక్తసిక్తం చేయడానికి అనుమతించాయి, కొత్త తిరుగుబాట్లకు బీజాలు నాటడానికి అనుమతించాయి. అంతకుమించి సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇతర భద్రతా దళాల నిష్పా క్షికతకు సవాలు విసిరే అవాంఛనీయమైన దుఃస్థితిలో ఉంచాయి.

ఒక సీఆర్పీఎఫ్‌ భద్రతా సలహాదారు మణిపుర్‌ సీఎం బీరెన్‌సింగ్‌కు మార్గనిర్దేశం చేస్తుండగా, భద్రతా దళాల ప్రత్యేక రక్షణ చట్టం పరిధిలోకి రాని ప్రాంతాల్లో పౌర అధికారులకు సైన్యం, కేంద్ర పారామిలటరీ బలగాలు సాయం చేస్తున్నాయి. కుకీల పట్ల పక్షపాతం చూపుతున్నాయని ఆరోపిస్తూ అస్సాం రైఫిల్స్‌పై మణిపుర్‌ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడం, అస్సాం రైఫిల్స్‌ను తొలగించాలని మైతేయిలు డిమాండ్‌ చేయడం, మరోవైపున నిషేధిత ఉగ్ర వాద గ్రూపులను సైన్యం, అస్సాం రైఫిల్స్‌ విడుదల చేయడంపై లేవ నెత్తుతున్న ప్రశ్నలు మణిపుర్‌ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి.

ఇప్పుడు ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ ప్రధాన పని లూటీకి గురైన ఆయుధాలను తిరిగి పొందడమే. వివిధ ప్రదేశాలలో ఆయుధ డిపా జిట్‌ పెట్టెలను ఉంచినప్పటికీ, మెజారిటీ ప్రజలు వాటి పక్కన సెల్ఫీలు తీసుకుంటున్నారు. మణిçపుర్, ఈశాన్య ప్రాంతాలపై జరుగు తున్న సెమినార్లలో పరిస్థితిని వివరించడానికి వాడుతున్న మాటలు: ‘అరాచకం’, ‘మరో కంబోడియా’, ‘సమాజాల మధ్య పూర్తి అప నమ్మకం’. ఆశ్చర్యకరంగా, ప్రధానమంత్రి లాగే, ఆర్మీ చీఫ్‌ గానీ, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ గానీ మణిపుర్‌ను ఇంతవరకూ సందర్శించలేదు. జరుగుతున్న తిరుగుబాటును మొగ్గలోనే తుంచివేసే విషయంలో ప్రభుత్వం తన రాజకీయ సంకల్ప లేమిని ప్రస్ఫుటంగా చూపిందని అక్కడి నిపుణులు అంటున్నారు. ఈశాన్యం నుండి 25 మంది లోక్‌సభ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందినవారే. మణిపుర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. రాజకీయ పరిష్కారం సాధించాలంటే, ముందుగా చేయాల్సిన విధులు: హింసను అరికట్టడం, రాష్ట్రపతి పాలన విధించడం.
-వ్యాసకర్త సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

Advertisement
Advertisement