కాలానికి ముందు పయనించిన కవి

Acharya Yarlagadda Laxmi Prasad Article On Gunturu Seshendra Sharma - Sakshi

సందర్భం

‘‘నేను పుస్తకాలతో మనిషి పశుత్వా నికి ఆనకట్టలు కడతాను; వాడు పశుత్వంతో మనిషికే ఆనకట్టలు కడ తాడు’’ (నీరై పారిపోయింది) అన్న గుంటూరు శేషేంద్ర శర్మ ఈ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోదగిన కవి. ఒక అందమైన పోయెం అంటే దానికి ఒక గుండె ఉండాలి, అది కన్నీరు కార్చాలి, క్రోధాగ్నులు పుక్కిలించాలి అని చెప్పిన శేషేంద్ర 1927 అక్టోబర్‌ 20న నెల్లూరులోని తోటపల్లి గూడూరు గ్రామంలో జన్మించారు. బీఏ చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. జర్నలిజం పట్ల మక్కువతో తాపీ ధర్మారావు వద్ద ‘జనవాణి’లో ఉద్యోగం చేశారు. కానీ సాహిత్యం ఆయనను వెంటాడటంతో అన్నిటినీ వదిలి కవిత్వాన్ని ప్రేమించడం ప్రారంభించారు.

ఆయన కవిత్వంలో ప్రాచీన, ఆధునిక ధోరణులు అందంగా ఇమిడి పోతాయి. ప్రగతి శీలతనూ, ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాల్నీ, మార్క్స్‌ ఫిలాసఫీనీ ఏక కాలంలో జోడించి ఈ దేశానికి అవసర మైన విలువైన సాహిత్య సిద్ధాంతాన్ని ఆయన ‘కవిసేన మేనిఫెస్టో’ పేరిట మనకు అందించారు. ‘షోడశి– రామాయణ రహస్యాలు’ పేరుతో వాల్మీకి సుందర కాండకు అద్భుతమైన తాంత్రిక భాష్యాన్ని అందించిన శేషేంద్ర మేఘదూతానికీ, వాల్మీకి రామాయణానికీ మధ్య ఉన్న సంబంధంపై జర్మనీ ఇండొలాజికల్‌ యూనివర్సిటీలో అపురూపమైన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.

‘ఇద్దరు రుషులు– ఒక కవి’ శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వంపై విశిష్టమైన పరిశోధనా వ్యాసాన్ని రాశారు. ‘స్వర్ణ హంస’ పేరుతో నైషధంపై లోతైన విమర్శ చేశారు. ‘నా దేశం– నా ప్రజలు’, ‘మండే సూర్యుడు’, ‘గొరిల్లా’, ‘ఆధునిక మహాభారతం’, ‘నీరై పారిపోయింది’, ‘సముద్రం నా పేరు’, ‘పక్షులు’, ‘శేష జ్యోత్స్న’ పేరిట అద్భుతమైన కావ్యాల్ని ఆయన రచించారు. ‘కాలరేఖ’ పేరిట సాహితీ వ్యాసాల్నీ వెలువరించారు. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నోబెల్‌ సాహిత్య పురస్కారానికి నామినేట్‌ అయిన రెండో భారతీయుడు శేషేంద్ర. తెలుగు విశ్వవిద్యాలయం డి.లిట్‌ ఇవ్వగా... పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ‘రాసేందు’ బిరుదును ప్రదానం చేసింది. ‘కామోత్సవ్‌’ పేరిట ఆయన రాసిన సీరియల్‌ నవల తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది.

‘ఒక్క పువ్వు రంగును చూస్తూ శతాబ్దాలు బ్రతకగలను’ అని చెప్పిన శేషేంద్ర కవిత్వాన్ని ఆధునిక, సంప్రదాయ కవులు ఇరువురూ ఇష్టపడ్డారు. చాలాచోట్ల శేషేంద్ర కవిత్వంలో నన్నయ్య తచ్చాడుతారనీ, పెద్దన, శ్రీనాథుడిని ఆయన ఉపాసించినట్లున్నారనీ, విశ్వనాథ, జాషువా, రాయప్రోలు, కృష్ణశాస్త్రి వంటివారి పలుకుబడులు అక్కడక్కడా కనబడుతూ ఉంటాయనీ పుట్టపర్తి ఆయన ‘రుతుఘోష’కు రాసిన ముందుమాటలో అన్నారు. ‘‘నీది మంచి పద్యమా, లేక ఫ్రెంచి మద్యమా, కవిరేవ విజనాతి, కవిదేవ సుధాగీతి, శ్రీనాథుడి క్రీడల్లో, అల్లసాని వాడల్లో కూడా దొరకని పదచిత్రం’’ అని శ్రీశ్రీ ప్రశంసించారు.

‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చిందీ’ అని ‘ముత్యాల ముగ్గు’ కోసం ఆయన ఒకే ఒకపాట రాసినా అది సినీ సాహితీ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. సంస్కృత భాషా సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యంలో లోతైన పరిజ్ఞానం ఉన్న శేషేంద్ర ఫ్రెంచి కవిత్వం, గ్రీకు విషాదాంత నాటకాలు, మార్క్సిస్ట్‌ సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాళిదాసు, భవభూతి, టి.ఎస్‌. ఇలియట్, వేమన, వాల్మీకి, బొదిలెర్, రేంబో, శ్రీశ్రీ, ప్లేటోల సమన్వయం శేషేంద్ర! 

‘‘కవికి సామాజిక స్పృహ కావాలి. కానీ వర్తమాన ఆంధ్రకవితా రంగంలో ఈ సామాజిక స్పృహ ఒక నీచస్థాయి నినాద రూపం ధరించి భయంకర సుడిగుండంలా ఏర్పడింది. ఈ నినాదం నుంచి యువకుల్ని రక్షించుకోవలసిన సాహిత్య అవసరం బాధ్యతాయుతమైన సామాజిక స్పృహ ఉన్నవాళ్లం దరి మీదా ఉంది’’ అన్న మాటలు ఆయన కాలానికి అతీతంగా నిలుస్తాయి. ‘‘కళ్ళు తుడుస్తాయి/ కమలాలు వికసిస్తాయి/ మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా’’– అంటూ గజల్స్‌ కూడా రాసిన శేషేంద్ర కవిత్వంలో ఉర్దూ సాహిత్య పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. ‘ఎప్పుడు ఆకు రాలి పోతుందో గాలికే తెలియదు’ అంటూ 30 మే 2007న శేషేంద్ర రాలిపోయారు. ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం లభించకపోవడం ఒక బాధగా మిగిలిపోయింది.

వ్యాసకర్త రచయిత: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, రాజ్యసభ మాజీ ఎంపీ
(మే 30న  గుంటూరు శేషేంద్ర శర్మ వర్ధంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top