Tirumala: ఆనంద నిలయ విమాన విశిష్టత

Tirumala Ananda Nilayam Gold Plated Gopuram Uniqueness - Sakshi

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువుండే నెలవు ఆనంద నిలయం. తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి ఉన్న ప్రదేశమే ఆనంద నిలయం. గర్భాలయమైన ఆనంద నిలయంపై నిర్మించిన బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానంగా పేరుపొందింది. ఈ విమాన నిర్మాణానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి బంగారు గోపురం మూడంతస్తులుగా ఉంటుంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలోను, మూడోది వర్తులాకారంలోను ఉంటాయి. 

ఏకశిలపై నిర్మితమైన ఆనంద నిలయ గోపురం ఎత్తు ముప్పయ్యేడు అడుగుల ఎనిమిది అంగుళాలు. గోపురం కింద ఉండే ప్రాకారం ఎత్తు ఇరవయ్యేడు అడుగుల నాలుగు అంగుళాలు. నేలపై నుంచి బంగారు కలశం వరకు ఆనంద నిలయ విమానం ఎత్తు అరవై ఐదు అడుగుల రెండంగుళాలు. మొదటి అంతస్తు పదిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి బొమ్మలూ ఉండవు. ఇందులో లతలు, మకర తోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఉంటాయి. 


రెండో అంతస్తు ఎత్తు పదడుగుల తొమ్మిది అంగుళాలు. ఇందులో నలభై బొమ్మలు ఉంటాయి. మకర తోరణంతో పాటు వరాహస్వామి, నరసింహస్వామి, వైకుంఠనాథుడు తదితర విష్ణు రూపాలు, జయవిజయులు, గరుడ, విష్వక్సేన, అనంత, ఆంజనేయ, మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. ఇందులో ఉత్తరంవైపు శ్రీవేంకటేశ్వరుడు విమాన వేంకటేశ్వరుడిగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలం విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా లభిస్తుందని భక్తుల విశ్వాసం. (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!)

గోపురం చివర వర్తులాకారంలో ఉండే అంతస్తు పదహారడుగుల మూడంగుళాల ఎత్తులో ఉంటుంది. ఇందులో మహాపద్మంతో పాటు ఇరవై బొమ్మలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లోను, నాలుగు మూలల్లోను ఎనిమిది సింహాలు ఉంటాయి. గోపుర కలశానికి ఆనుకుని ఉండే మహాపద్మంలో చిలుకలు, లతలు, హంసలు వంటి చిత్రాలు కనువిందు చేస్తాయి. శ్రీవారి గర్భగుడి నుంచి మలయప్పస్వామి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు విమాన ప్రదక్షిణ చేస్తూ బయటకు వెళతారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించే ఏ పూజాద్రవ్యమైనా, తోమాలసేవలో సమర్పించే పుష్పాలనైనా, అభిషేకానికి సమర్పించే ఆకాశగంగ తీర్థాన్నైనా విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళతారు. (క్లిక్ చేయండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top