అమ్మా.. ఏమైందమ్మా.. లేమ్మా!

Cow Leg Injured In Kurnool Treated in YSR Sanchara Pashu Aarogya Seva - Sakshi

లేద్దామంటే శరీరం సహకరించదు.. తిందామంటే మేత లేదు.. యజమాని ఎక్కడో తెలియదు.. చుట్టూ ఎవరూ కనిపించరు.. అంబా అని అరిచినా పట్టించుకునే దిక్కు లేదు. మలమూత్రాలు చేస్తున్న చోట అలా కూలబడిపోయింది ఓ గోమాత. ఒకటి కాదు, రెండు కాదు, ఐదు రోజులు గడిచిపోయింది. అరిచీ అరిచీ నీరసించింది. ఓ దూడ తల్లి చుట్టూ తిరుగుతోంది. తల్లికి ఏమైందో తెలియక అక్కడక్కడే తచ్చాడుతోంది. మౌనంగా రోదిస్తూ.. తల్లికేసి చూస్తూ అలా నిల్చుండిపోతోంది. ఏమైందమ్మా.. లేమ్మా.. అన్నట్లు దీనంగా చూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. 

కర్నూలు: అది మండలంలోని క్రిష్టిపాడు గ్రామ శివారు ప్రాంతం. చుట్టూ పొలాలే తప్ప నివాస ప్రాంతాలు కనిపించవు. ప్రతిరోజూ రైతులు పొలం పనులు చేసుకుని వెళ్తున్నారు. అయితే ఎక్కడి నుంచో ఓ ఆవు అరుపులు వినిపిస్తున్నా, మంద నుంచి తప్పిపోయి ఉంటుందనుకుని మళ్లీ పనుల్లో ఉండిపోయారు. ఇలా ఐదు రోజులు గడిచిపోయాయి. జొన్న పైరు కావడంతో ఏపుగా పెరగడం, పొలం మధ్యలో ఆవు పడిపోవడంతో రైతులు గుర్తించే అవకాశం లేకపోయింది. చివరకు ఇక్కడే ఎక్కడో ఉన్నట్లుగా అనుమానించి అందరూ వెతకడంతో ఎట్టకేలకు గురువారం ఆనవాలు లభించింది. దగ్గరికి వెళ్లి చూడగా కుప్పకూలిన ఓ అవు, దాని పక్కనే దూడ కనిపించాయి. ఆవు వెనుక కాలు విరిగి గాయమవడంతో అక్కడే కూలబడింది.

దూడ వయస్సు కూడా పది రోజులకు మించి ఉండదని తెలుస్తోంది. ఈ రెండూ ఐదు రోజులుగా నరకం అనుభవించాయి. ఈ దృశ్యం చూసి చలించిన రైతులు వెంటనే ఆవు, దూడకు నీళ్లు తాపించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ వాహనం గుర్తుకు వచ్చి 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బందికి నిముషాల్లో అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం సర్జరీ కోసం ఆవుతో పాటు దూడను వాహనంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మారుమూల ప్రాంతానికి సంచార వాహనం రావడం.. మూగజీవి వేదన తీర్చే ప్రయత్నం చేయడం అందరి అభినందనలు అందుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top