అలయెన్స్‌ ఎయిర్‌కు తొలి మహిళా సీఈవో

Harpreet Singh Appointed CEO of Alliance Air, First Woman Head - Sakshi

న్యూఢిల్లీలోని ‘అలయెన్స్‌ ఎయిర్‌’ సంస్థకు ఈరోజు కొత్త సీఈవో వస్తున్నారు. అత్యున్నతమైన ఆ స్థానంలో హర్‌ప్రీత్‌ సింగ్‌ను నియమిస్తూ శుక్రవారం నాడే ఎయిర్‌ ఇండియా ఎం.డి., చైర్మన్‌ రాజీవ్‌ బన్సాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఎయిర్‌ ఇండియా’ సహాయక సంస్థ అయిన ‘అలయెన్స్‌ ఎయిర్‌’.. దేశీయ పౌర విమానయాన సంస్థ. దేశం లోపల విమానాలు నడుపుతుంటుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి రోజూ దేశంలోని 55 గమ్యస్థానాలకు అలయెన్స్‌ ఎయిర్‌ విమానాలు చేరుతుంటాయి. విమాన భద్రత అంతా ఇప్పటి వరకు హర్‌ప్రీత్‌ చేతుల్లో ఉండేది. ఫ్లయిట్‌ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆమె. ఇప్పుడిక అలయెన్స్‌ ఎయిర్‌కు తొలి మహిళా సీఈవోగా అంతే కీలకమైన పై పోస్టులోకి వెళ్లారు. ఆమె పేరుతోనే ‘ఎయిర్‌ ఇండియా’లో మరొక రికార్డు కూడా ఉంది. ఎయిర్‌ ఇండియా తొలి మహిళా పైలట్‌ హర్‌ప్రీత్‌. 1988లో చేరారు. అయితే కొన్నాళ్లకు ఆరోగ్య కారణాల వల్ల విరామం తీసుకుని, ఆ తర్వాత వేరే విభాగానికి మారవలసి వచ్చింది. 

హర్‌ప్రీత్‌ జన్మస్థలం ఢిల్లీ. అక్కడే చదువుకున్నారు. ‘ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్‌ అకాడమీ’ నుంచి వాణిజ్య విమానాల పైలట్‌గా శిక్షణ పొందారు. ఎయిర్‌ ఇండియా పైలట్‌ ఎంపిక పరీక్షల్లో విజయం సాధించారు. హర్‌ప్రీత్‌తో పాటు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ నివేదిత భాసిన్, కెప్టెన్‌ క్షమత బాజ్‌పాయ్‌ వంటి వారు పైలట్‌ అవాలనుకునే అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. హర్‌ప్రీత్‌ ఈ ఏడాది జనవరిలో ‘అబ్దుల్‌ కలామ్‌’ అవార్డు పొందారు. విశిష్టమైన వ్యక్తిగత విజయ సాధనలకు, దేశానికి అందించిన విలక్షణమైన సేవలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఎయిర్‌ ఇండియాలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ను కూడా ఆమె నడిపించారు. ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఎఇ.ఎస్‌.ఐ.) ముంబై శాఖ ఛైర్మన్‌గా, ఎఇ.ఎస్‌.ఐ. ఢిల్లీ కౌన్సిల్‌ సభ్యురాలిగా ఉన్నారు. ఎయిర్‌ ఇండియా ‘ఫ్లయింట్‌ సేఫ్టీ’ డైరెక్టర్‌గా కూడా హర్‌ప్రీత్‌ తొలి మహిళే. పైలట్‌గా చేరిన తొలిరోజుల్లో కొన్నాళ్లు విరామం తీసుకుని యు.ఎస్‌. వెళ్లి ఫ్లయిట్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా శిక్షణ పొందారు. తర్వాత ఇండియా వచ్చి, ఎయిర్‌ ఇండియాలోనే వేరే విభాగంలో చేరారు. 

ఇండియన్‌ ఉమెన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ (ఐ.డబ్లు్య.పి.ఎ.) అధ్యక్షురాలిగా కూడా ఉన్న హర్‌ప్రీత్‌ పౌర విమానయానంలో కెరీర్‌ను ఎంచుకున్న మహిళలకు మార్గదర్శకంగా ఉంటున్నారు. పైలట్‌గా శిక్షణ పొందడానికి ప్రధాన అవరోధం ఫీజులకు అయ్యే ఖర్చు. అది లక్షల్లో ఉంటుంది. ప్రతిభావంతులై ఉండి ఆర్థిక కారణాల వల్ల శిక్షణను కొనసాగించలేని పరిస్థితి ఎదురైన యువతులకు ఐ.డబ్లు్య.పి.ఎ. ఛారిటీ ద్వారా ఆమె రుణాలు అందే ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: కొన్ని లైకులు... కాస్త వెలుతురు)

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top