
ధగధగలాడే వజ్రాల మెరుపులు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. వజ్రాల మెరుపులే కాదు, వాటి ధరలు కూడా కళ్లు చెదిరేట్లు చేస్తాయి. వజ్రాల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ధర చెల్లిస్తే గాని, రవ్వంత వజ్రమైనా కొనడం సాధ్యం కాదు. అలాంటిది వజ్రాలు ఉచితం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?ప్రపంచంలో వజ్రాలు ఉచితంగా దొరికే చోటు ఒకే ఒక్కటి ఉంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది ఇదే! ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. మర్‌ఫ్రీబరో గ్రామానికి చేరువలో ఉన్న ఈ వజ్రాల ఆలవాలం పేరు ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’. దాదాపు 37.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు వజ్రాల గని.
దీనిని 1972లో స్టేట్ పార్కుగా మార్చారు. అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కులో 35 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. వీటిలో కొన్ని అరుదైన రకాలకు చెందినవి కూడా ఉన్నాయి.ఈ పార్కులోకి ప్రవేశించడానికి, ఇందులో టెంట్లు ఏర్పాటు చేసుకుని బస చేయడానికి మాత్రమే డబ్బు చెల్లించాలి. ఇక్కడ ఎవరైనా నేల తవ్వుకుని, వజ్రాలను ఏరుకోవచ్చు. చాలామంది సెలవురోజుల్లో ఇక్కడకు కుటుంబ సమేతంగా వచ్చి, తవ్వకాలు జరుపుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మట్టిని, ఇసుకను జల్లెడపడుతూ గంటల తరబడి ఓపికగా వెదుకులాట సాగిస్తుంటారు.
తవ్వకాల్లో ఎవరికైనా ఒక్క వజ్రం దొరికినా, వారి పంట పండినట్లే! ఈ పార్కులో గడపడానికి పెద్దలకు రోజుకు 15 డాలర్లు (రూ.1285), పన్నెండేళ్ల లోపు పిల్లలకు 7 డాలర్లు (రూ.600) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కొందరు ఇక్కడ టెంట్లు వేసుకుని రోజుల తరబడి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. పార్కు బయట టెంట్లను అద్దెకు ఇచ్చే దుకాణాలు, తవ్వకాల కోసం ఉపయోగించే పనిముట్లు, పరికరాలను అద్దెకిచ్చే దుకాణాలు కూడా ఉంటాయి. ఇంటి నుంచి పలుగు పార వంటివి తెచ్చుకోనివారు వాటికి ఈ దుకాణాల్లో అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ వజ్రాలు దొరికినట్లయితే, వాటిని ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన పనిలేదు. చక్కగా వాటిని ఉచితంగానే ఇంటికి తీసుకుపోవచ్చు.
మిన్నెసోటా ప్రాంతానికి చెందిన డేవిడ్ డికుక్ అనే వ్యక్తికి ఇక్కడ అరుదైన బ్రౌన్ డైమండ్ దొరికింది. గత నెల అతడు ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తుండగా, చాక్లెట్ రంగులో «మెరుస్తున్న రాయి కనిపించింది. దానిని పరీక్షించి చూస్తే, అది 3.81 కేరట్ల బ్రౌన్ డైమండ్‌గా తేలింది. ఈ పార్కులో ఇప్పటి వరకు దొరికిన వజ్రాల్లో ఎక్కువ శాతం పారదర్శకమైన తెల్లవజ్రాలే అయినా, కొందరికి అరుదైన బ్రౌన్ డైమండ్స్, యెల్లో డైమండ్స్ కూడా దొరికాయి. ఈ పార్కులో వజ్రాలు మాత్రమే కాకుండా కొంత తక్కువ విలువ కలిగిన అమెథిస్ట్, జాస్పర్, ఎగేట్, క్వార్ట్‌జ్ వంటి రత్నాలు కూడా దొరికాయి. అర్కాన్సాస్–టెక్సస్ సరిహద్దులో ఉన్న ఈ పార్కు సెలవురోజుల్లో జనాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది.