World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ నుంచి తప్పించుకోండి ఇలా..

World Stroke Day Warning Signs Of Stroke Everyone Should Know - Sakshi

కర్నూలు (హాస్పిటల్‌): స్ట్రోక్‌ అంటే చాలా మంది హార్ట్‌ ఎటాక్‌ అనుకుంటారు. కానీ స్ట్రోక్‌ అంటే మెదడుకు వచ్చే పోటు. దీనినే సాధారణ భాషలో పక్షవాతం  అంటారు. హార్ట్‌ ఎటాక్‌ అంటే అందరికీ అవగాహన వస్తోంది. కానీ బ్రెయిన్‌ స్ట్రోక్‌పై చాలా మందికి అవగాహన లేదు. కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకరపోయిన తర్వాత మాత్రమే వైద్యుల వద్దకు వెళ్తున్నారు. దీనికి ముందు లక్షణాలు గుర్తించి వెంటనే వైద్యుల వద్దకు వెళితే జరగాల్సిన నష్టాన్ని సాధ్యమైనంతగా నివారించుకోవచ్చు. దీనినే గోల్డెన్‌ పీరియడ్‌ అని పిలుస్తారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 29వ తేదీన అవగాహన దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 44 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో 4 లక్షల జనాభా పెరిగి ఉంటుంది. అంటే మొత్తం జనాభాలో 5శాతం మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అంటే 48 లక్షలలో 2.4లక్షల మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు నంద్యాల జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలోనూ ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స ఉంది. 

ఈ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా వైద్యం అందుతుండటంతో లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లో (గోల్డెన్‌ పీరియడ్‌)లో బాధితులు సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స అందుకోవాలి. ఇందుకోసం అవసరమై న ఇంజెక్షన్లు, మందులు వైద్యులు రోగికి అందించి చికిత్స చేస్తారు. ఇలాంటి గోల్డెన్‌ పీరియడ్‌లో వెళ్లడం వల్ల అవయవాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడవ చ్చు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి వారం స్ట్రోక్‌ బాధితుల సంఖ్య ఐదేళ్ల క్రితం 120 దా కా ఉండేది. అది ప్రస్తుతం 160 వరకు చేరుకుంది.  

స్ట్రోక్‌కు కారణాలు 
దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో లేకపోవడం, మద్యపానం, ధూమపానం అతిగా సేవించడం, స్థూలకాయం కారణంగా ఒంట్లో కొవ్వుస్థాయిలు (కొలె్రస్టాల్‌) పెరిగిపోవడం, గుండెజబ్బులకు మందులు సరిగ్గా వాడకపోవడం వంటివి స్ట్రోక్‌కు దారి తీస్తాయి.  

స్ట్రోక్‌తో జరిగే తీవ్రనష్టం 
మనిషి మెదడుకు వెళ్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం కారణంగా మెదడు పనితీరు క్షీణించి స్ట్రోక్‌ వస్తుంది. 85శాతం మందికి కాళ్లు, చేతులు, చచ్చుపడిపోవడం, కొందరికి మూతి వంకర పోవడం, మాట నత్తిగా రావడం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు కోల్పోవడం వంటివి జరుగుతాయి. 15శాతం మందిలో మాత్రమే మెదడులో నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం   అవుతుంది.  

గోల్డెన్‌ పీరియడ్‌లో వస్తేనే మేలు 
బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలు కనిపించిన వెంటనే నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరోఫిజీషియన్‌ ఉన్న ఆసుపత్రికి వెళితే వెంటనే వారు థ్రాంబోలైసిస్‌ అనే ఇంజెక్షన్‌ వేస్తారు. ఇది వెంటనే నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పల్చన చేసి రక్త సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే నిమిష నిమిషానికి బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ తగ్గిపోతాయి. దీనివల్ల మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. నాలుగున్నర గంటలు దాటి ఆలస్యంగా వచ్చినా అడ్వాన్స్‌గా వచ్చిన మెకానికల్‌ థాంబెక్టమి అనే విధానం ద్వారా మెదడుకు యాంజియో నిర్వహించి గడ్డకట్టిన రక్తాన్ని తొలగించవచ్చు. ఇది ఖర్చుతో, రిస్క్‌తో కూడిన పని. కావున నాలుగున్నర గంటల్లోపు రావడం లేదా అస్సలు స్ట్రోక్‌ రాకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం.  
–డాక్టర్‌ హేమంతకుమార్, న్యూరోఫిజీషియన్, కర్నూలు

స్ట్రోక్‌ లక్షణాలను బట్టి శస్త్రచికిత్స 
అన్యూరిజం అనేది రక్తనాళాల్లో బలహీనమైన ప్రాంతం. ఇది బయటకు ఉబ్బుతుంది. రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం వల్ల హేమరేజిక్‌ స్ట్రోక్‌ రావచ్చు. అన్యూరిజం పగిలిపోయినట్లయితే మెదడు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం అవుతుంది. లక్షణాలను బట్టి సర్జికల్‌ క్లిప్పింగ్, ఎండోవాసు్కలర్‌ థెరపి లేదా కాయిలింగ్, ప్రో డైవర్టర్లు, ఆర్టిరియోవెనస్‌ మాల్‌ ఫార్మేషన్, డీ కమోప్రెసివి క్రానియోటమి విధానాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి ఉంటుంది. రోగి వయస్సు, వైద్య పరిస్థితిని బట్టి స్ట్రోక్‌ నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.  
–డాక్టర్‌ వై.వరుణ్‌కుమార్‌రెడ్డి, న్యూరోసర్జన్, కర్నూలు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top