
నేడు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే
గుజరాత్‌లోని వల్సాద్ పట్టణంలో...
పదహారు సంవత్సరాల అనమ్త అహ్మద్, శివమ్ మిస్త్రీకి రాఖీ కట్టింది. ఈ దృశ్యం చూస్తున్నవారు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నాచెల్లెళ్ల పాటలు పాడారు. రాఖీ కట్టడం అనేది సాధారణ దృశ్యమే కదా, వారు ఎందుకంత భావోద్వేగానికి గురయ్యారు?
కాస్త వెనక్కి వెళితే...
ముంబైకి చెందిన అనమ్త అహ్మద్ చేతుల్లో ఒకటి రియా అనే అమ్మాయిది. శివమ్ మిస్త్రీ సోదరి అయిన రియా గత సంవత్సరం అనారోగ్యంతో చనిపోయింది. ఆమె చేతిని సూరత్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో అనమ్త అహ్మద్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ‘అనమ్త చేతులను తాకినప్పుడల్లా రియాను చూసినట్లుగానే ఉంటుంది. మా కుటుంబంలోని ఒకే ఒక ఆడబిడ్డ దురదృష్టవశాత్తు చనిపోయింది. అయితే, అనమ్తతో మాట్లాడినప్పుడు నా బిడ్డ బతికే ఉన్నట్లు అనిపిస్తుంది’ అంటాడు రియా, శివమ్ తండ్రి బాబీ మిస్త్రీ.
ఇక అనమ్త అహ్మద్ విషయానికి వస్తే....
హైటెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ తాకి ఆమె కుడి చెయ్యి పూర్తిగా దెబ్బతిన్నది. ఎడమ చెయ్యి 20 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేసేది. సర్జరీతో ఎడమ చెయ్యి మెరుగుపడింది.
రెండు సంవత్సరాల తరువాత... వల్సాద్‌లో...
నాలుగవ తరగతి చదువుతున్న రియా భరించలేని తల నొప్పితో అనారోగ్యానికి గురైంది. వాంతులు చేసుకుంది. ఎన్నో ఆస్పత్రుల తరువాత తల్లిదండ్రులు రియాను సూరత్‌లోని ‘కిరణ్ హస్పిటల్’లో చేర్పించారు. ఆ హాస్పిటల్‌లోనే రియా ‘బ్రెయిన్ డెడ్’ వార్త విని కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు.
ఆ సమయంలో ‘డొనేట్ లైఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రియా కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమె ఆర్గాన్స్ డొనేట్ చేసేవిధంగా ఒప్పించారు. ‘స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్’లో రిజిస్టర్ అయిన తరువాత రియా కుడి చేతిని అనమ్త అహ్మద్‌కు అమర్చారు. కిడ్నీ, కాలేయాలను అవసరార్థుల కోసం దానం చేశారు.
ఇటీవల శివమ్ మిస్త్రీకి రాఖీ కట్టడానికి తల్లిదండ్రులతో కలిసి ముంబై నుంచి వల్సాద్ వెళ్లింది అనమ్త అహ్మద్. ఆమెను చూసిన శివమ్ కుటుంబసభ్యులు రియాను చూసినట్లుగా అనిపించి భావోద్వేగానికి గురయ్యారు. అనమ్త కుడి చేయిని ప్రేమగా తడిమారు. ‘రాఖీ పండగ రోజు నేను ఏదో పని మీద బయటికి వెళ్లాను. త్వరగా ఇంటికి రావాల్సిందిగా నా భార్య ఫోన్ చేసింది.
నేను ఇంటికి వెళ్లేసరికి అనమ్త, ఆమె తల్లిదండ్రులు, మా బంధువులు, స్నేహితులు ఉన్నారు. శివమ్‌కు రాఖీ కట్టడానికి వచ్చాం అని అనమ్త తండ్రి అఖిల్ అహ్మద్ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. కళ్లనీళ్లు ఆగలేదు. ఇది ఎప్పటికీ గుర్తుండి పోయే రోజు’ అని ఆ రోజును గుర్తు తెచ్చుకున్నాడు రియా తండ్రి బాబీ మిస్త్రీ.
‘అనమ్త శివమ్‌కు రాఖీ కడుతున్నప్పుడు, స్వయంగా రియానే కడుతున్నట్లు అనిపించింది. రియాకు ఇష్టమైన గులాబ్ జామ్‌ను అనమ్తకు తినిపించాను. ప్రతి సంవత్సరం రాఖీ పండగ ఇలాగే జరుపుకోవాలనుకుంటున్నాం’ అంటుంది రియా తల్లి త్రిష మిస్త్రీ.
మాది ఒకే కుటుంబం
నాకు అన్నదమ్ములు లేరు. తనకు ఉన్న ఒక్కగానొక్క సోదరికి శివమ్ దూరం అయ్యాడు. అందుకే శివమ్ నాకు సోదరుడు. ప్రతి సంవత్సరం నా సోదరుడికి రాఖీ కట్టడానికి వస్తాను. నన్ను వేరే పట్టణం, కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా వారు చూడలేదు. తమ ఇంటి బిడ్డగానే చూశారు. నాలో రియను చూసుకున్నారు.
– అనమ్త అహ్మద్