
అవయవ దానంలో ఏపీ టాప్
పదేళ్లలో 358 మంది నుంచి అవయవాలు తొలగింపు
1,148 మందికి కొత్త జీవితం
నేడు అవయవ దాన దినోత్సవం
ఆరిలోవ: అవయవ దానంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. జీవన్ దాన్ పేరిట 2015లో అవయవ దాన కార్యక్రమం ప్రారంభమైంది. రోడ్డు, ఇతర ప్రమాదాలకు గురైన వారిలో బ్రెయిన్ డెడ్ అవుతున్న వ్యక్తుల అవయవాలను ఇతరులకు అమర్చి జీవం పోస్తున్నారు. గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కార్నియా తదితర అవయవాలను అవసరమైన వారికి అమర్చి కొత్త జీవితం అందిస్తున్నారు. ఇలా సేకరించిన వివిధ అవయవాలను గడచిన పదేళ్లలో 1,148 మందికి అమర్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 358 మంది బ్రెయిన్ డెడ్ అయిన వారినుంచి అవయవాలు తొలగించారు. వాటిలో 634 మందికి కిడ్నీలు, 271 మందికి లివర్, 88 మందికి గుండె, 151 మందికి ఊపిరితిత్తులు, ముగ్గురికి పాంక్రియాస్, ఒకరికి స్మాల్ బౌల్ అవయవాలను అమర్చారు.
అవయవాల కోసం 5 వేలమంది ఎదురుచూపు
రాష్ట్రంలో జీవన్‌దాన్ కింద 5 వేల మంది అవయవాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు కిడ్నీ కోసమే దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవయవాలు స్వీకరించటం కోసం 81 ఆస్పత్రులు మాత్రమే పేర్లను నమోదు చేసుకున్నాయి. వాటిలో సగం ఆస్పత్రులు ఇంతవరకు ఒక్క బ్రెయిన్ డెడ్ కేసునూ ప్రకటించలేదని జీవన్‌దాన్ ప్రతినిధులు చెప్తున్నారు.
విమ్స్‌లో ప్రత్యేక సర్జరీలు
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో అవయవ దానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల మొదటిసారిగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదర్శంగా నిలిచింది. ఇంతవరకు విమ్స్‌లో నాలుగు బ్రెయిన్ డెడ్ కేసులకు సర్జరీలు నిర్వహించి అవయవాలను స్వీకరించారు. విమ్స్ ఆస్పత్రిని ఆదర్శంగా తీసుకొని కేజీహెచ్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా బ్రెయిన్ డెడ్ కేసులను గుర్తించి అవయవాలను స్వీకరించగలిగితే మరింత మందికి ప్రాణాలు కాపాడవచ్చని జీవన్‌దాన్ ప్రతినిధులు చెబుతున్నారు.
మరింతమంది ముందుకు రావాలి
అవయవ దానం చేయడానికి మరింతమంది ముందుకు రావాలి. రాష్ట్రంలో 358 మంది నుంచి 1,148 అవయవాలు స్వీకరించాం. వాటిని అవసరమైన వారికి అమర్చాం. ప్రస్తుతం సమారు 5 వేల మంది అవయవాలు అవసరమైన వారు ఉన్నారు. అవయదానంపై ప్రజల్లో మరింతగా అవగాహన కలిగించాల్సి ఉంది. అవయదానం చేసిన వారి మృతదేహానికి అంత్యక్రియలు జరుపుకోవడం కోసం రూ.10 వేల అందించి ప్రభుత్వ అధికారుల చేత ఘన నివాళులు అర్పిస్తున్నాం. విమ్స్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశాం. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలు స్వీకరించే కార్యక్రమం చేపట్టనున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, కో–ఆర్డినేటర్, జీవన్‌దాన్, విమ్స్ డైరెక్టర్