లైంగిక వేధింపులకు అడ్డుకట్ట | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు అడ్డుకట్ట

Published Fri, Oct 2 2020 8:03 AM

UP Woman Train Girls To Self Defense For Prevent Molestation - Sakshi

లక్నో: లైంగిక వేధింపులకు గురైన ఆమె జీవితం మీద ఆశను కోల్పోయింది. తనను తాను నిలదొక్కుకొని ఇప్పుడు బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు చారిత్రాత్మక నగరమైన రాజధాని లక్నోలో నివాసముంటుంది ఉష. మురికివాడల పిల్లలకు విజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో 2010లో టీచర్‌గా వెళ్లింది. తన సొంత ఖర్చులతో ఆ వాడలో ఒక షెడ్‌ నిర్మించింది. అందులోనే పిల్లలకు తరగతులు నిర్వహించేది. ఒకనాడు ఆ తరగతి గదిలోనే ఓ వ్యక్తి చేతిలో లైంగికదాడికి లోనయ్యింది. ఈ సంఘటన ఉష మనస్సుపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఆర్నెల్ల పాటు చీకటిలోనే కాలం గడిపింది. ఆ తర్వాత తేరుకొని ఇప్పటివరకు 75,000 మంది బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చి ఆత్మరక్షణలో మహిళలకు ఒక ఉదాహరణగా మారింది ఉషా విశ్వకర్మ. ఉష స్థాపించిన ‘రెడ్‌ బ్రిగేడ్‌’ ట్రస్ట్‌ ఇప్పుడు అక్కడ చట్టం కింద నమోదు చేయబడింది.



ఏర్పాటు చేసిన ‘రెడ్‌ బ్రిగేడ్‌’ 
ప్రపంచ ఉనికి మహిళల చేతిలో ఉందని నిరూపించింది ఉష. తన బాల్యాన్ని పేదరికంలో గడపడంతో మురికివాడల పిల్లలకు విద్యను అందించడానికి వెళ్ళింది. ఆ సమయంలో జరిగిన సంఘటనను ఉష చెబుతూ –‘ఆ వ్యక్తి నాకు దగ్గరగా వచ్చినప్పుడు, అతనిని ఎదిరించే ధైర్యం కూడా నాకు లేదు. అతని చేష్టలను చూసి, కొట్టి అక్కడ నుండి తప్పించుకున్నాను. కానీ, కొన్నాళ్లపాటు ఆ ఘటన నన్ను వెంటాడింది. ‘ఎంతో కొంత ధైర్యం ఉన్న నాకే ఇలా జరిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించాను. సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనతోనే 2011లో ’రెడ్‌ బ్రిగేడ్‌’ సంస్థను స్థాపించాను. నా లాగే లైంగిక వేధింపులకు గురైన 15 మంది అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చాను’ అని వివరించింది. 

ఆయుధాలు లేని టెక్నిక్స్‌
ఉష తన మిషన్‌ ద్వారా మహిళలు సమాజంలో నిర్భయంగా జీవించగల వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటోంది. ఆమె తన మిషన్‌కు ఎక్కువమంది అమ్మాయిలను కనెక్ట్‌ చేయాలనుకుంటుంది. ఈ బ్రిగేడ్‌కు అనుబంధంగా ఉన్న బాలికలు ఎరుపు కుర్తా, నల్ల సల్వార్‌ ధరిస్తారు. ప్రస్తుతం అలాంటి 100 మంది బాలికలు రెడ్‌ బ్రిగేడ్‌కు జతచేయబడ్డారు. ఈ బ్రిగేడ్‌ ద్వారా ఎలాంటి ఆయుధాలు లేకుండా 15–20 ‘నిరాయుధీకరణ’ మార్షల్‌ ఆర్ట్స్‌ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేసింది. తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ బాలికల పట్ల దుష్టులు ఎలా ప్రవర్తిస్తారో దృష్టిలో ఉంచుకుని ఈ పద్ధతిని సవరించింది. 


ఆల్‌ ఇన్‌ వన్‌
ప్రభుత్వ ‘కవాచ్‌ మిషన్‌’ కింద 56,000 మంది మహిళలకు ఉష మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇచ్చింది. ఇది కాకుండా, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, రైల్వేలు, బ్యాంకులు, పోలీసులు, ఇతర వృత్తులు, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి 50 ప్రసిద్ధ సంస్థల మహిళలకు వారి ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను నేర్పిస్తోంది. ఈ విధంగా అన్ని వృత్తులు, అన్ని శాఖలలో పనిచేసే మహిళలకు  శిక్షణ ఇవ్వడంలో బిజీగా ఉంటోంది.

నాటకాల ద్వారా అవగాహన
బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో అవగాహన చేసే దిశగా ఆలోచించింది. ఇందుకు మంచి సన్నివేశాలను ఎంచుకొని లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా స్వరం పెంచిన ఉష ఇప్పటివరకు 700 వీధి నాటకాలను నిర్వహించింది. 225 సెమినార్ల ద్వారా మహిళలకు ఆత్మరక్షణ పద్ధతుల గురించి తెలియజేసింది.  తనలాగా మరొక్కరు కూడా బాధపడకూడదు. జీవితం మీద నిరాశను పెంచుకోకూడదు. స్త్రీ–పురుషులిద్దరికీ జీవించే హక్కు ఉన్న ఈ సమాజంలో బలం కారణంగా మగవాడు చూపించే దౌర్జన్యాలకు ఆడది బలి కావద్దు. అకృత్యాలను అడ్డుకునే శక్తిని స్త్రీ పెంచుకోవాలని స్వరం పెంచి మరీ నినదిస్తోంది ఉషా విశ్వకర్మ.

Advertisement
Advertisement