చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్‌ చేయాలని..! | Sakshi
Sakshi News home page

చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్‌ చేయాలని..!

Published Sun, May 19 2024 11:49 AM

Woman Fulfills Bollywood Dream By Dancing To Sridevis Mitwa In Manali

కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్‌లో డాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్‌ అనే మహిళ డాన్స్‌ తెగ వైరల్‌ అవుతోంది.

1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్‌ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్‌ 1 హీరోయిన్‌గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్‌ హిట్‌. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్‌ సావన్‌ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్‌వా’... పాట కూడా ఆదరణ అందింది. 

విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్‌ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్‌ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్‌ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లింది. అక్కడ సేమ్‌ చాందినీ సినిమాలోని లొకేషన్‌ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్‌వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. 

ఆమె కొడుకు ఆవి వడేకర్‌ షూట్‌ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్‌’లాంటి పాటలకు డాన్స్‌ చేయడానికి లొకేషన్స్‌ వెతుక్కుంటున్నారు. 

 

(చదవండి: ఫోటో అదుర్స్‌! దెబ్బకు కస్టమర్‌ బేరం ఆడకుండా కొనాల్సిందే!)

Advertisement
 
Advertisement
 
Advertisement