ఒత్తిడి ఏదైనా దిగుబడి నష్టమే! | Whole Plant Energy Survival Explains Stress‑Induced Loss | Sakshi
Sakshi News home page

ఒత్తిడి ఏదైనా దిగుబడి నష్టమే!

Nov 3 2026 5:00 AM | Updated on Nov 3 2026 5:00 AM

Whole Plant Energy Survival Explains Stress‑Induced Loss

పంటలు వాతావరణంలో జరిగే చిన్న మార్పులకు కూడా స్పందించే సున్నితమైన జీవకణ వ్యవస్థలు. అతిగా వేడి పెరగటం, అతిగా తేమ పెరగటం, వర్షపాతంలో హెచ్చుతగ్గులు.. ఇవన్నీ మొక్క లోపల శరీరధర్మాలు, జీవరసాయన మార్పులకు దారి తీస్తాయి. వాటి ఫలితంగానే ఆకులు వాలిపోవటం, పూత రాలిపోవటం, వేర్లు కుళ్ళిపోవటం, దిగుబడి తగ్గటం వంటి లక్షణాలుగా బయటపడతాయి. 

వేడి ఒత్తిడితో మొదట ప్రభావితమయ్యే భాగం ఆకులపై ఉన్న పత్ర రంధ్రాలు. ఇవి మొక్కకు ‘శ్వాస ద్వారాలు’ వంటివి. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను లోపలికి తీసుకొని, నీటి ఆవిరిని బయటకు వదులుతాయి. ఈ ప్రక్రియే కిరణజన్య సంయోగక్రియకి కూడా పునాది. 

సాధారణంగా పత్తి, టమాటా, మిరప, అపరాలు వంటి సీ3 పంటలు 30 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 35 డి. సె. వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. కానీ, ఆకుకు ఈ పరిమితిని దాటి ఉష్ణోగ్రత సోకినప్పుడు మొక్కకు నీటి కొరత ప్రమాద సంకేతం అందుతుంది. ఈ సమయంలో మొక్క తక్షణమే తన పత్ర రంధ్రాలను మూసివేస్తుంది. ఆ వెంటనే కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఆకులోకి రావటం ఆగిపోతుంది. మొక్కలో ఆహార తయారీ ప్రక్రియ నిలిచిపోతుంది. 

మొక్క ‘సర్వైవల్‌ మోడ్‌’లోకి వెళ్తుంది. సాధారణ పరిస్థితులు లేకపోయినప్పుడు, తనలో నిల్వ ఉన్న పిండిపదార్థాలను వినియోగిస్తూ మొక్క ప్రాణం నిలుపుకోవటానికి  ప్రయత్నిస్తుంది. దీన్నే ‘కార్బన్‌ స్టార్వేషన్‌’ అంటారు. మధ్యాహ్నం తర్వాత ఆకులు వాలిపోవటం, పచ్చదనం తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
మొక్కలు అధిక ఉష్ణోగ్రతలు, కరువు లేదా ఇతర వాతావరణ ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పుడు వాటి లోపల శారీరక, జీవరసాయన, హార్మోన్‌ సంబంధిత మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా 35 డి.సె.లకు పైగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, మొక్క కణాల్లోనిప్రొటీన్లు దెబ్బతిని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను సృష్టిస్తాయి. 

్రపారంభ దశలో మొక్క ఈ ఒత్తిడిని తగ్గించేందుకు కొన్ని రక్షణాత్మక ఎంజైములను ఉత్పత్తి చేస్తుంది. అయితే వేడి ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే హార్మోన్‌ వ్యవస్థను మార్చుకుంటుంది. అబ్సిసిక్‌ యాసిడ్‌ ఉత్పత్తితో ఆకులపై ఉన్న పత్ర రంధ్రాలు మూసుకుపోతాయి. దీని వల్ల మొక్కలో నుంచి నీరు ఆవిరవ్వటం తగ్గుతుంది. 

ఆహారోత్పత్తి తగ్గిపోతుంది. ఒత్తిడి ఇంకా కొనసాగితే, ఇథిలీన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అకస్మాత్తుగా పెరుగుతుంది. అందుబాటులో ఉన్న శక్తి పూత, పిందెలను నిలబెట్టటానికి సరిపోదు. ఆత్మరక్షణ కోసం మొక్క పూలు, చిన్న పిందెలు, ఆకులనూ రాల్చుతుంది. మిరపలో పూలు ఒక్కసారిగా రాలిపోవటం, టమోటాలో చిన్న పిందెలు ఎండిపోవటం, పత్తిలో గూడలు పడిపోవటం ఇటువంటి వేడి ఒత్తిడి వల్లనే. 

వేడి ఒత్తిడితోనే కాదు.. ఎక్కువ వర్షాలు లేదా నీటి ముంపు కారణంగా కూడా పంటలకు నష్టం జరుగుతుంది. మట్టి రంధ్రాలలో ఉండే గాలి పూర్తిగా నీటితో నిండిపోతుంది. ఈ సమయంలో వేర్లకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. వేర్లకు కూడా గాలి లేకపోతే పని చేయవు. అధిక వేడి, అధిక తేమ ఈ రెండూ పంటలకు నష్టం చేసేవే. ఫలితం ఒకటే. మొక్క తన జీవనాన్ని కాపాడుకోవటానికి దిగుబడిని త్యాగం చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement