నటి విద్యాబాలన్‌ ఫాలో అయ్యే డైట్‌ ఇదే..! | Vidya Balan Follows 'No Raw' Food Diet And Its Benefits | Sakshi
Sakshi News home page

నటి విద్యాబాలన్‌ ఫాలో అయ్యే "నో రా డైట్‌" అంటే..!

Published Tue, Jun 11 2024 12:16 PM

Vidya Balan Follows 'No Raw' Food Diet And Its Benefits

బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకొని మరీ నటించే గొప్ప నటి విద్యాబాలన్‌. తనుంటే హీరోతో పనిలేదు అన్నట్లుగా సినిమా ఆశాంతా ఆమె చుట్టూనే తిరిగేలా ఆమె నటన ఉంటుంది. బ్యూటీ పరంగా ఇప్పటికీ యువ హీరోయిన్‌లను తలదన్నేలా గ్లామరస్‌గా ఉంటుంది. వయసు పెరుగుతుందా అన్న సందేహం వచ్చేలా ఆమె ఫిట్‌నెస్‌ ఉంటుంది. ఇంతలా గ్లామర్‌ని మెయింటెయిన్‌ చేసేందుకు విద్యా బాలన్‌ ఎలాంటి డైట్‌ ఫాలో అవుతుందంటే..

బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఆకట్టుకునే నటనా నైపుణ్యానికే గాక ఆరోగ్యకరమైన డైట్‌ని అనుసరించడంలో కూడా పేరుగాంచింది. ఇటీవల ఒక ఇంటర్యూలో తను ఎలాంటి లైఫ్‌స్టైల్‌ని ఫాలో అవుతుందో షేర్‌ చేసుకుంది. తాను ఇంట్లో వండిన గ్లూటైన్‌ రహితమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తాను "నో రా డైట్‌"ని ఫాలో అవుతానని చెప్పారు. 

'నో రా డైట్'‌ అంటే..
పచ్చి ఆహారం కాకుండా వండినవి అని అర్థం. ఇక్కడ నటి విద్యా బాలన్‌ కూరగాయాలు, కొన్ని రకాల పండ్లు, మాంసం, పాల సంబంధిత ముడి ఆహారాలను పచ్చిపచ్చిగా తీసుకోనని చెబుతున్నారు. సురక్షితమైన పోషకాహారం కోసం చక్కగా వండిన వాటికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అనారోగ్యాలను నివారించడం కోసమే తాను ఇలాంటి డైట్‌ని అనుసరిస్తానని చెప్పారు. పచ్చి ఆహారాల్లో ముఖ్యంగా మాంసాలు, గుడ్లు, పాశ్చరైజ్‌ చేయని పాల ఉత్పత్తుల్లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి తీవ్రమైన ఆహార వ్యాధులకు కారణమవుతాయి. ఈ ఆహారాలను పూర్తిగా ఉడికించడం వల్ల ఆయా వ్యాధికారకక్రిములు నశించి, ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

వండిన ఆహార పదార్థాల్లో సంక్లిష్ట ప్రోటీన్లు, ఫైబర్లు విచ్ఛిన్కన్నం అవుతాయి. దీంతో సులభంగా జీర్ణమయ్యి, ప్రేగు సిండ్రోమ్‌ లేదా జీర్ణశయాంతర రుగ్మతలు దరి చేరవు. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ నో రా డైట్‌ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉడికించి లేదా కుక్‌ చేసినవి తినడం వల్ల మన శరీరం పోషకాలను సులభంగా గ్రహించగలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా టమోటాలలోని యాంటీ ఆక్సిడెంట్‌ లైకోపిన్‌, క్యారెట్‌లోని బీటా కెరోటిన్‌ను కుక్‌ చేస్తే సులభంగా గ్రహించగలుగుతాం. 

ఎలా ఫాలో అవ్వాలంటే..
కుక్‌ చేయడం వల్ల పోషక శోషణ మెరుగుపడుతుంది. పోషకాలను సంరక్షించే వంట పద్ధతులను ఉపయోగించడం ముఖ్యం. స్టీమింగ్‌, మైక్రోవేవ్‌, వంటి పద్దుతల్లో తక్కువ నీటితోనే ఉడికిపోతాయి. పోషకాల నష్టం కూడా జరగదు. అయితే ఉడకబెట్టడం వల్ల నీటిలో కరిగిపోయే విటమిన్‌ సీ, బీ వంటి వాటిని కోల్పోవచ్చు. 

అందువల్ల పోషక విలువలు కోల్పోకుండా ఉండే వంట పద్ధతులను అనుసరించడం ముఖ్యం. ఈ డైట్‌ని అనుసరించాలనుకున్నప్పుడూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. తగినంత పోషకాలు లభించేలా ఉడికించిన కూరగాయలు తోపాటు పండ్లు, ధాన్యాలు వంటివి కూడా చేర్చుకోవాలని చెబుతున్నారు. ఇలా చేస్తే వండటం వల్ల కోల్పోయిన పోషకాల నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారని అన్నారు. 

ఈ డైట్‌ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ..కొన్ని రకాల కూరగాయాలు, పండ్లను కుక్‌ చేసి తీసుకోవాలి, అలాగే కొన్ని రకాల పోషకాల కోసం ఫైబర్‌తో కూడిన పప్పుధాన్యాలు పండ్లను పచ్చిగానే తీసుకోవాలని చెబుతున్నారు. వ్యక్తిగత ఆహార అవసరాలకు అనుగుణంగా వండిన వాటి తోపాటు ముడి ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని అందించగలుగుతారు. దీనివల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?)
 

Advertisement
 
Advertisement
 
Advertisement