మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..? | Sakshi
Sakshi News home page

మిలమిల మెరిసే మిణుగురు చేపలు గురించి విన్నారా..?

Published Tue, Jun 11 2024 10:51 AM

 Florocent Fish Or Glow Fisht Story What?

చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌! అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? 

తైవాన్‌లో సందడి చేస్తున్నాయి  ఈ చేపలు. మరి ఇన్నాళ్ల నుంచి సముద్రం అడుగున మన మన కంటపడకుండా ఉన్నాయా..? అంటే కానేకాదు. ఎందుకంటే ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. 

ఎందుకీ ప్రయోగం అంటే?
ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది. సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. వీటిని ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అని పిలుస్తారు. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. నిజానికి ఇలాంటి ప్రయోగాలు 2001 నుంచే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. 

తర్వాత ఏడేళ్లు శ్రమించి ఇలాంటి ఏంజెల్‌ చేపలను సృష్టించి శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట.

తినొచ్చా అంటే..
వీటిని నిక్షేపంలా వండుకుని తినొచ్చు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు  . మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పైనే పలుకుతాయట. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు. మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. 

దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.

(చదవండి: ఎవరీ సావిత్రి ఠాకూర్‌? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement