నువ్వు సల్లగుండాలే.. చిన్న నవ్వు ఒకటి సరిపోదా! వైరల్‌ వీడియో

Video clip of a great friendship - Sakshi

స్నేహం ఏం కోరుకుంటుంది? కోట్లు కోరుకోదు. చిన్న నవ్వు ఒకటి సరిపోదా!స్నేహం ‘మా దేశం అయితేనే’ అంటుందా?‘కానే కాదు’ అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్‌ సరిపోదా!

బ్రిటన్‌కు చెందిన జర్నలిస్ట్, టీవి ప్రెజెంటర్‌ తాను చేస్తున్న ‘టైమ్‌లెస్‌ తమిళనాడు’ టీవీ ప్రొగ్రామ్‌ కోసం తమిళనాడులోని మదురైలో అడుగుపెట్టింది. మదురై అద్భుత అందాల అనుభూతి నుంచి పూర్తిగా బయటికి రాకముందే మల్లెపూలు అమ్మే మహిళ రూపంలో ఆమెకు అపురూపమైన స్నేహం కలిసింది.

ఈవిడ మదురై తమిళ యాస ఆమెకు అర్థం కాకపోవచ్చు.ఆవిడ బ్రిటీష్‌ ఇంగ్లీష్‌ ఈవిడకు అర్థం కాకపోవచ్చు... అయితే అదేమీ వారి స్నేహానికి అడ్డుగోడ కాలేదు. పూలమ్మ ఎలెక్స్‌కు జడ వేసి మల్లెపూలు పెట్టేది.ఆ జడ చూసుకుని ఎలెక్స్‌ మురిసిపోయేది!తన స్టైల్లో జోకులు చెప్పేది పూలమ్మ. అవి అర్థం కాక ఎలెక్స్‌ తెల్లముఖం వేసే లోపే దారిన పోయే దానయ్యలు తమకు తెలిసిన ఇంగ్లీష్‌లో ఎలెక్స్‌కు ఎక్స్‌ప్లెయిన్‌ చేసేవాళ్ళు.

మదురై నుంచి వెళ్లే క్రమంలో తన సెలబ్రిటీ పూలమ్మతో ఫొటోలు దిగింది ఎలెక్స్‌.కథ ఇదే అయితే అది మదురైలో మాత్రమే ఆగిపోయి ఉండేది. అయితే ఎలెక్స్‌ స్వదేశానికి చేరుకున్న తరువాత పూలమ్మతో తాను ఉన్న చిన్న వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. తక్కువ సమయంలోనే ఈ క్లిప్‌కు 4.7 లక్షల వ్యూస్‌ వచ్చాయి.ఈ వీడియో క్లిప్‌లో పెద్ద పెద్ద మాటలేవీ లేకపోవచ్చు. అయితే వారి భావోద్వేగాన్ని, అనుబంధాన్ని  నెటిజనులు తమదైన శైలిలో వ్యాఖ్యానించారు.

‘మల్లెపూలు అందమైనవి. మీ స్నేహం అంతకంటే అందమైంది’ అన్నారు.‘గ్రేట్‌ క్రాస్‌ కల్చరలిజం’ అంటూ వీరి స్నేహాన్ని ఆకాశానికెత్తారు! తమిళనాడులోని సముద్రపు అందాలు, కొండలు, కోవెలల సౌందర్యం, తేయాకు తోటల పచ్చదనం, చల్లని మనసున్న హిల్‌ స్టేషన్‌ల గురించి చెబుతూ ‘అద్భుతం’ అన్నది ఎలెక్స్‌. అయితే వీరి వీడియో క్లిప్‌ మాత్రం సామాజిక మాధ్యమాల్లో మహా అద్భుతంగా మారింది!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top